ఎన్ని‘కల’ నెరవేరేనా! 14 ఏళ్లుగా ఎన్నికలకు దూరం ఆ మండలం..

ఎన్ని‘కల’ నెరవేరేనా! 14 ఏళ్లుగా ఎన్నికలకు దూరం ఆ మండలం..
  • 14 ఏండ్లుగా స్థానిక ఎన్నికలకు దూరమైన మంగపేట మండల ప్రజలు
  • రిజర్వేషన్ల ఇష్యూతో  కోర్టుకెక్కిన గిరిజన, గిరిజనేతర వర్గాలు
  • 23 గ్రామాలను షెడ్యూల్డ్​ ​గా గుర్తించొద్దంటూ సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలు 
  • మధ్యంతర ఉత్తర్వులతో నేతలు, ఓటర్లలో చిగురిస్తున్న ఆశలు
  • ములుగు జిల్లాలోనే మంగపేటలో మెజార్టీ జీపీలు, ఓటర్లు  
  • వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయో లేదోననే సస్పెన్స్ 

ములుగు/మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండల ప్రజలకు పద్నాలుగేండ్లుగా ఓటు వేసే హక్కు  లేకుండాపోయింది.  2011 నుంచి  సర్పంచ్​, ఎంపీటీసీ ఎన్నికలు  నిర్వహించకపోగా.. ప్రత్యేక అధికారుల పాలన కిందే ఈ గ్రామాలు ఉండిపోయాయి.  మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో మంగపేట మండల ప్రజల్లో, నేతల్లో  కొత్త ఆశలు చిగురించాయి. అయితే.. త్వరలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఈసారైనా ఓటు  వేస్తామా..! పోటీ చేస్తామా..! లేదోననే  సందిగ్ధత ఓటర్లలో, నేతల్లో నెలకొంది.  లేదంటే.. సుప్రీం కోర్టు  తుది తీర్పు వచ్చే దాకా ఆగక తప్పదేమోననే సందేహమూ  వ్యక్తమవుతోంది.

రిజర్వేషన్​ ఇష్యూతో కోర్టుకు..

జిల్లాలోని ఏటూరునాగారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో ఉమ్మడి వరంగల్​జిల్లాలోని 13 మండలాల్లో మంగపేట  ఒకటి. దీని పరిధిలో  25 గ్రామ పంచాయతీలు, 230 పోలింగ్​ కేంద్రాలు ఉన్నాయి. 19,452 మంది పురుషులు, 19,911 మంది మహిళలు, నలుగురు ఇతరులతో కలిపి మొత్తంగా 39,367 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో అత్యధిక జీపీలు, ఓటర్లున్న మండలం కూడా మంగపేటనే. కాగా..14 ఏండ్లుగా మండలంలో లోకల్ బాడీ ఎన్నికలు జరగడం లేదు.  తాము 1950లో ములుగు తాలూకా పరిధిలోకి వచ్చామని గిరిజనేతరులు పేర్కొంటున్నారు. 

అధిక గిరిజన గ్రామాలు ఉండడంతో ఐటీడీఏ పరిధిలోకి తీసుకొచ్చారని గిరిజనులు చెబుతున్నారు.  స్థానిక ఎన్నికలప్పుడు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా.. ఇరువర్గాల మధ్య రిజర్వేషన్ల గొడవలతో  కోర్టును ఆశ్రయిస్తుండడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.  పలు దఫాల్లో కోర్టులో ఇరువర్గాలకు అనుకూల, ప్రతికూల తీర్పులు వచ్చాయి.  2013లో రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని గిరిజనేతరులు హైకోర్టుకు వెళ్లడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.  దీన్ని సవాలు చేస్తూ  2021లో పై బెంచ్ కు వెళ్లి గిరిజనులు స్టే తెచ్చుకున్నారు.  ఇక సుప్రీంకోర్టుకు వెళ్లిన గిరిజనేతరులకు 23 గ్రామాలను షెడ్యూల్​గా పరిగణించొద్దని మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

 గిరిజనేతరుల్లో చిగురించిన ఆశలు 

ప్రతి ఎన్నికలప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేర కు అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నా కానీ..  రిజర్వేషన్ ఇష్యూతో ఇరువర్గాలు కోర్టులకు వెళ్తుండడంతో ఎన్నికలు నిలిచిపోతున్నాయి.  ఒక సందర్భంలో ఎన్నికలు జరిగినా పాలన మాత్రం నిలిచిపోయింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మంగపేటకు చెందిన పరమాత్మ, పూజారి సమ్మయ్య 2021లో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాజాగా వీరి తరఫున సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

జస్టిస్ మహేశ్వరి బెంచ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిస్తూ.. మంగపేట మండలంలోని పంచాయతీలను షెడ్యూల్ గ్రామాలుగా పరిగణించొద్దంటూ పేర్కొంది. 2026, ఫిబ్రవరి16న ఫైనల్ హియరింగ్​ ఉంటుందని వాయిదా వేసింది. సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో  స్థానిక ఎన్నికల లాంఛనమే అనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే అధికారులు ఎంపీటీసీ, పంచాయతీ వార్డుల విభజన పూర్తి చేసింది. మరోవైపు ఎన్నికలు జరుగుతాయో లేదోననే అనుమానాలు తలెత్తాయి. 

పలు పార్టీల నేతలు, యువకుల్లో  తీర్పు కొత్త ఆశలను రేకెత్తించింది. అయితే సుప్రీం మధ్యంతర ఉత్వర్వులను రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం  పరిగణలోకి తీసుకుంటుందో లేదోననే అనుమానాలు వస్తున్నాయి. తుది తీర్పు వచ్చే వర కు వేచి చూసే పరిస్థితి ఉంటే  ఎన్నికలు జరగపోవచ్చునని  రాజకీయ నిపుణులు అంటున్నారు. 

మా రాజ్యాంగ హక్కుల కోసమే పోరాడుతున్నాం 

మంగపేట మండలంలోని గిరిజన గ్రామాల్లో మా హక్కులను సాధించుకునేందుకే కోర్టులను ఆశ్రయించగా పలుమార్లు అనుకూలం గా తీర్పువచ్చింది. ఎన్నికలు జరిగి పాలన కూడా కొనసాగింది. భూములు, ఆస్తుల విషయంలో మాకు గిరిజనేతరులతో ఎలాంటి విభేదాలు లేవు. మా దురదృష్టం ఏంటంటే రాజ్యాగం కల్పించిన హక్కులను ఉపయోగించుకోలేకపోతున్నాం. మా హక్కుల్ని  కాపాడుకోవడం కోసమే పోరాడుతున్నాం.  
- పోలెబోయిన ఆదినారాయణ, ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ మండల అధ్యక్షుడు, మంగపేట

సుప్రీంకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటాం  

అధికారులు చేసిన తప్పిదాల కారణంగానే  సుప్రీంకోర్టుకు వెళ్లాం. గిరిజనులతో మాకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మేము ప్రభుత్వంతో మాత్రమే పోరాడుతున్నాం. పాల్వంచ సంస్థానం నుంచి 23 గ్రామాలను ములుగు తాలూకాలో విలీనం చేశాక వెలువడిన గెజిట్​ పై అభ్యంతరాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో మా తరఫు లాయర్​వాదనలు వినిపించారు.  సుప్రీం కోర్టు తుది తీర్పు ఎలా ఇచ్చినా కట్టుబడి ఉంటాం.  
- చింత పరమాత్మ, మంగపేట