
ముంబై: లీగ్ దశలో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆఖరాటకు రెడీ అయ్యాయి. ఆదివారం ఇరుజట్ల మధ్య మెగా టైటిల్ ఫైట్ జరగనుంది. ఇందులో నెగ్గి సగర్వంగా తొలి కప్‌ను అందుకోవాలని ఇరుజట్లు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. రెండు జట్ల ఫామ్ చూస్తే మ్యాచ్‌లో ఫేవరెట్‌ను అంచనా వేయడం కష్టం. లీగ్ స్టేజ్‌లో చెరో ఆరు విజయాలు సాధించినా.. స్వల్ప రన్‌రేట్ తేడాతో ఢిల్లీ డైరెక్ట్‌గా ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఎలిమినేటర్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తు చేస్తూ ముంబై మెగా ఫైట్‌కు దూసుకొచ్చింది.
అయితే ముంబై కప్ ముద్దాడాలంటే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫామ్‌లోకి రావాలి. వరుసగా మూడు హాఫ్ సెంచరీల తర్వాత హర్మన్ మళ్లీ బ్యాట్ ఝుళిపించలేదు. యస్తికా, హేలీ మాథ్యూస్ శుభారంభాన్నిస్తే ముంబైకి తిరుగుండదు. మిడిలార్డర్‌లో సివర్ బ్రంట్, కెర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లోఇసీ వాంగ్ మరోసారి కీలకం కానుంది. బ్రంట్, సైకా ఇషాక్ ఫామ్‌ను కొనసాగిస్తే ఢిల్లీకి కష్టాలు తప్పవు. ఇక డీసీ బ్యాటింగ్ లైనప్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మకు టీ20ల్లో సూపర్ రికార్డు ఉంది.
ఆరంభంలో ఈ ఇద్దరు చెలరేగితే పరుగుల ప్రవాహమే. గత మ్యాచ్‌లో విఫలమైన రొడ్రిగ్స్‌తో పాటు మారిజానె కాప్, అలైస్ క్యాప్సీ భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టారు. బౌలింగ్‌లో క్యాప్సీ, జొనాసెన్, శిఖా పాండే, కాప్ అంచనాలను అందుకుంటే ముంబైని నిలువరించొచ్చు. రాధా యాదవ్ స్పిన్ మ్యాజిక్ కూడా డీసీకి కీలకం కానుంది. ఇక బ్రబౌర్న్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై నెగ్గితే, డీసీ రెండింటిలో గెలిచింది.