55 ఏండ్లు దాటిన పోలీసులు డ్యూటీకి రావొద్దు

55 ఏండ్లు దాటిన పోలీసులు డ్యూటీకి రావొద్దు

ముంబై: కరోనా ఎఫెక్టుతో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 55 ఏండ్ల వయసు పైబడిన పోలీసులు ఎవరూ డ్యూటీలకు రావొద్దంటూ ఆఫీసర్లు ఆదేశాలిచ్చారు. వారంతా ఇండ్లలోనే ఉండాలని సూచించారు. ముంబై సిటీలో కరోనా బారిన పడి ముగ్గురు పోలీసులు చనిపోయిన తర్వాత పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ముంబై సిటీలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో 55 ఏళ్ల వయసు దాటిన పోలీసులు విధుల్లో ఉండరు. వాళ్లందరినీ ఇళ్లకే పరిమితం కావాలని సూచించాం” అని ముంబై పోలీస్ చీఫ్​ పరమ్ వీర్ సింగ్ పేర్కొన్నారు. గడిచిన మూడ్రోజుల వ్యవధిలోనే 50 ఏళ్ల వయసు పైబడిన ముగ్గురు పోలీసులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 55 ఏళ్లు దాటిన వారు త్వరగా వైరస్ బారిన పడే చాన్స్ ఉందన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.