బెంగళూరు: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ మహిళ దారుణంగా మోసపోయారు. మీ పేరిట డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించడంతో బాధితురాలు తన ఇల్లు, జాగలు అమ్మి మరీ రూ.2 కోట్లు దుండగులకు ముట్టజెప్పారు. డబ్బులన్నీ వేశాక వాళ్ల ఫోన్లు స్విచ్చాఫ్ వస్తుండటంతో ఆమె మోసపోయానని తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆరు నెలల పాటు ట్రాప్ చేసిన దుండగులు
బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బబితా దాస్ తన పదేండ్ల కొడుకుతో కలిసి విజ్ఞాన్‌నగర్‌లో ఉంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో అనుమానాస్పద వస్తువులతో పార్సిల్ వచ్చిందంటూ ఆమెకు కొరియర్ బాయ్ కాల్ చేశాడు. ఆపై ముంబై పోలీసులమంటూ పోలీస్ గెటప్‌లో ఉన్న మరో ఇద్దరి నంచి వీడియో కాల్ వచ్చింది. వారు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. తాము చెప్పినట్లే చెయ్యాలని, లేదంటే ఆమె కొడుకును కూడా కేసులో ఇరికిస్తామని బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి బబితా దాస్ డబ్బులు పంపించారు.
ఇలా ఆరు నెలల వ్యవధిలో రకరకాల పేర్లు చెప్పి బెదిరించడంతో ఆమె విజ్ఞాన్‌నగర్‌లోని తన ఫ్లాట్, మలూరులోని రెండు ఇండ్ల జాగలు అమ్మేసి మరీ వచ్చిన డబ్బంతా ఆ నకిలీ పోలీసులకు అప్పగించారు. దుండగులు అంతటితో ఆగకుండా ఇంకా డిమాండ్ చేయడంతో బాధితురాలు బ్యాంక్ లోన్ తీసుకుని సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆఖరికి నేరగాళ్లు దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డబ్బంతా కలెక్ట్ చేస్కొమ్మని చెప్పి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్కోవడంతో బబితా దాస్ మోసపోయానని గ్రహించారు. బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు.
