మరోసారి నిరాశ పరిచిన సన్ రైజర్స్.. ముంబై చేతిలో ఓటమి

మరోసారి నిరాశ పరిచిన సన్ రైజర్స్.. ముంబై చేతిలో ఓటమి
  • వరుసగా మూడో  విజయం సొంతం
  • చెలరేగిన గ్రీన్, తిలక్, బౌలర్లు

హైదరాబాద్, వెలుగు: ఆడిన నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో చెరో రెండు గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కోసం తలపడిన పోరులో ఆతిథ్య సన్ రైజర్స్ హైదరాబాద్‌‌పై ముంబై ఇండియన్స్‌‌దే పైచేయి అయింది. ఉప్పల్‌‌లో రికార్డు స్థాయిలో 38 వేల పైచిలుకు ఫ్యాన్స్ ముంగిట సన్ రైజర్స్ నిరాశ పరిచింది. బ్యాటింగ్‌‌లో కామెరూన్ గ్రీన్ (40 బాల్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 నాటౌట్; 1/29), లోకల్ స్టార్ తిలక్ వర్మ (17 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 ) మెరుపులకు తోడు  బౌలర్లూ సత్తా చాటడంతో  మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో ముంబై 14 రన్స్ తేడాతో హైదరాబాద్‌‌ను ఓడించింది. ఆ టీమ్ మూడో విక్టరీ సొంతం చేసుకోగా.. రైజర్స్ మూడో ఓటమి మూటగట్టుకుంది.

మొదట ముంబై 20 ఓవర్లలో 192/5 స్కోరు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, భువనేశ్వర్, నటరాజన్ చెరో వికెట్ తీశారు. అనంతరం సన్ రైజర్స్ 19.5 ఓవర్లలో 178 రన్స్ కు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (41 బాల్స్ లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 48), హెన్రిచ్ క్లాసెన్ (16 బాల్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో  జేసన్ బెరెండార్ఫ్,  మెరిడిత్, పీయూష్ చావ్లా తలో రెండు వికెట్లు, గ్రీన్, అర్జున్ టెండూల్కర్ చెరో వికెట్ తీశారు.  గ్రీన్‌‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 

గ్రీన్ ధనాధన్.. తిలక్ తడాఖా

ముంబై ఇన్నింగ్స్‌‌లో ఆసీస్ యంగ్ స్టర్ కామెరూన్ గ్రీన్ ఖతర్నాక్ ఆట చూపెట్టగా  మధ్యలో హైదరాబాదీ తిలక్ వర్మ ధనాధన్ బ్యాటింగ్​తో జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ (28), ఇషాన్ (38) మంచి ఆరంభం ఇచ్చారు. తొలి ఓవర్లో రోహిత్ ఫోర్, రెండో ఓవర్లో సిక్స్ తో ఇషాన్ టచ్ లోకి వచ్చారు. మూడో ఓవర్లో స్పిన్నర్ సుందర్​కు రోహిత్ హ్యాట్రిక్ ఫోర్లతో వెల్​కం చెప్పాడు.

నటరాజన్ వేసిన ఐదో ఓవర్లో రెండు బౌండ్రీలు రాబట్టిన హిట్‌‌మ్యాన్‌‌  లైన్ మిస్సయి మార్‌‌క్రమ్‌‌కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌‌కు 41 రన్స్ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. భువీ బౌలింగ్‌‌లో మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన ఇషాన్ పవర్‌‌ప్లేలో ముంబైని 53/1తో నిలిపాడు. ఈ దశలో స్పిన్నర్లు వరుసగా 18 బాల్స్ లో బౌండ్రీ ఇవ్వకుండా కట్టడి చేయగా.. సుందర్ బౌలింగ్ లో కామెరూన్ గ్రీన్ సిక్స్ కొట్టగా.. మార్కండే బౌలింగ్‌‌లో ఇషాన్ 4,4 బాదడంతో సగం ఓవర్లకు ముంబై 80/1తో నిలిచింది.  అయితే మార్కో జాన్సెన్ వేసిన 12వ ఓవర్లో ఇషాన్‌‌తో పాటు డేంజర్ మ్యాన్ సూర్యకుమార్ (7)..  మార్‌‌క్రమ్‌‌ పట్టిన అద్భుత క్యాచ్ లకు పెవిలియన్ చేరడంతో 95/3తో ముంబై డీలా పడింది.

కానీ క్రీజులో కుదురుకున్న  గ్రీన్‌‌కు తోడైన లోకల్ స్టార్ తిలక్ వర్మ ఉన్నంతసేపు భారీ షాట్లతో అలరించాడు. జాన్సెన్ వేసిన బౌలింగ్ లో గ్రీన్ రెండు ఫోర్లు కొట్టగా.. తిలక్ వరుసగా రెండు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. దాంతో, 15 ఓవర్లకు ముంబై 130/3కి చేరుకుంది. మార్కండే బౌలింగ్ లో 4,6  బాదిన తిలక్.. భువీ ఓవర్లో లాంగాన్ మీదుగా సిక్స్ తో రెచ్చిపోయాడు. కానీ, భువీ నకుల్ బాల్ తో అతడిని పెవిలియన్ చేర్చడంతో  నాలుగో వికెట్​కు 56 రన్స్ పార్ట్​నర్​షిప్​ ముగిసింది. అప్పటికే స్కోరు 150 దాటగా.. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో గ్రీన్ 4,4, 4,6తో  20 రన్స్ పిండుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో తన తొలి ఫిఫ్టీ (33 బాల్స్) అందుకున్నాడు. 19వ ఓవర్లో భువీ ఆరు రన్సే ఇవ్వగా.. లాస్ట్ ఓవర్లో టిమ్ డేవిడ్ (16) రెండు ఫోర్లతో స్కోరు 190 దాటించాడు.

రైజర్స్ తడబాటు..  

ఫ్లాట్ పిచ్​పై ప్రత్యర్థికి భారీ స్కోరు ఇచ్చుకున్న సన్ రైజర్స్ ఛేజింగ్​లో  తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి నిరాశ పరిచింది. ముంబై పేసర్ బెరెండార్ఫ్ దెబ్బకు గత మ్యాచ్ సెంచరీ హీరో  హ్యారీ బ్రూక్ (9),  ఫామ్​లో ఉన్న రాహుల్ త్రిపాఠి (7) స్టార్టింగ్​లోనే ఔటవడంతో 25/2తో డీలా పడింది. ఈ టైమ్ లో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్,  కెప్టెన్ మార్ క్రమ్ (22) ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.

మెరిడిత్ వేసిన ఐదో ఓవర్లో సిక్స్ తో మయాంక్ గేరు మార్చగా పవర్  ప్లేలో రైజర్స్ 42/2తో నిలిచింది. తొలుత స్లోగా ఆడిన మార్ క్రమ్ షోకీన్ బౌలింగ్ లో సిక్స్ తో జోరందుకున్నాడు. ఇద్దరూ క్రీజులో కుదురుకోవడంతో రైజర్స్ పుంజుకునేలా కనిపించింది. కానీ, నాలుగు బాల్స్ తేడాలో మార్‌‌‌‌ క్రమ్ ను గ్రీన్, అభిషేక్ (1)ను చావ్లా పెవిలియన్ చేర్చడంతో హోమ్ టీమ్ సగం ఓవర్లకు 76/4తో ఎదురీత మొదలు పెట్టింది. మయాంక్ కు తోడైన హిట్టర్ క్లాసెన్ స్కోరు వంద దాటించాడు. చావ్లా వేసిన 14వ ఓవర్లో వరుసగా 4,6,6,4తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కానీ, లాస్ట్ బాల్ కు అతను ఔటయ్యాడు.  

ఆ వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్ మెరిడిత్ బౌలింగ్ లో మయాంక్, జాన్సెన్ (13) కూడా వెనుదిరగడంతో ముంబై విజయానికి చేరువైంది. చివరి మూడు ఓవర్లలో రైజర్స్ కు 43 రన్స్ అవసరం అయ్యాయి.  బెరెండార్ఫ్ వేసిన 18వ ఓవర్లో సుందర్ (10) రనౌటైనా 19 రన్స్ రావడంతో హైదరాబాద్  మళ్లీ రేసులోకి వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ సమద్ (9) క్రీజులో ఉండటంతో రైజర్స్ ఆశలు కోల్పోలేదు. కానీ, 19వ ఓవర్లో గ్రీన్ 4 రన్సే ఇచ్చి కట్టడి చేశాడు. లాస్ట్ ఓవర్లో 20 రన్స్ అవసరం అవగా.. రెండో బాల్​కు సమద్ రనౌటయ్యాడు. ఐదో బాల్​కు భువనేశ్వర్ (2)ను ఔట్ చేసిన అర్జున్ టెండూల్కర్ (1/18) మ్యాచ్ ముగించాడు.    

రోహిత్ @ 6000

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ  ఐపీఎల్ లో 6 వేల రన్స్ క్లబ్ లో చేరాడు. ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్​గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (6844), శిఖర్ ధవన్ (6477), డేవిడ్ వార్నర్ (6109)  టాప్–3లో ఉండగా.. రోహిత్ 6014 రన్స్ తో నాలుగో ప్లేస్ లో నిలిచాడు.
15 ఏండ్ల ఐపీఎల్ వరల్డ్ క్రికెట్ గతిని మార్చేసిన ఐపీఎల్ మంగళవారంతో 15 ఏండ్లు పూర్తి చేసుకొని 16వ పడిలోకి అడుగు పెట్టింది. 2008లో ఏప్రిల్ 18వ తేదీ కోల్​కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెం జర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ తో లీగ్ మొదలైంది. ఆ పోరు లో బ్రెండ న్ మెకల్లమ్ (158) భారీ సెంచరీతో విజృంభించడంతో కేకేఆర్ 140 రన్స్ తేడాతో ఆర్సీబీని ఓడించింది.