Mumbai Indians: హార్దిక్, రోహిత్, సూర్యతో ‘ది మిక్స్’ ఈవెంట్.. డ్యాన్స్, మ్యూజిక్‌తో ఫ్యాన్స్‌కు మెమరబుల్ నైట్

Mumbai Indians: హార్దిక్, రోహిత్, సూర్యతో ‘ది మిక్స్’ ఈవెంట్.. డ్యాన్స్, మ్యూజిక్‌తో ఫ్యాన్స్‌కు మెమరబుల్ నైట్

Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ క్యాంపులో సందడి నెలకొంది. ముంబై నగరంలోని జియో వరల్డ్ గార్డెన్‌లో నిర్వహించిన 'ది మిక్స్' అనే ప్రత్యేక ప్రోగ్రాంలో ముంబై కా రాజా రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇతర ప్లేయర్లు, కోచ్‌లు, జట్టు యాజమాన్యం, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ మాట్లాడుతూ.. మేము ఖచ్చితంగా మీ అందరి కోసం 6వ ట్రోఫీని గెలుచేందుకు మా ప్రయత్నిస్తామన్నారు. దీంతో అక్కడున్న ముంబై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టీమ్స్ లో ఒకటిగా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ జట్టు 2013, 2015, 2017, 2019, 2020 ఏడాదిల్లో ఛాంపియన్‌గా అవతరించింది. ఇక 2020 తర్వాత ముంబై మళ్లీ ఇప్పటి వరకు కప్పు గెలవలేదు. గత ఆరేళ్లుగా ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఈ ఏడాది తెర దించాలని జట్టు యాజమాన్యం ఎంతో పట్టుదలగా ఉంది. గత రెండేళ్లుగా హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు సారథిగా కొనసాగుతున్నాడు. అంతకు ముందు గుజరాత్ టైటాన్స్‌కు ట్రోఫీ అందించిన అనుభవం పాండ్యాకు ఉంది. ఈ ఏడాది అతడి కెప్టెన్సీలో జట్టు మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందని రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లు చెప్పుకొచ్చారు. 

కాగా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరందరూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ గెలవడంతో మంచి ఫామ్‌లోకి వచ్చారు. అయితే ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ తో మార్చి 29వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఆడబోతోంది. రోహిత్ శర్మ ఇచ్చిన ఈ హామీతో ఎంఐ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.