Sachin Tendulkar: స‌చిన్ డీప్ ఫేక్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు

 Sachin Tendulkar: స‌చిన్ డీప్ ఫేక్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆన్‌లైన్ గేమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఇటీవల డీప్‌ఫేక్ వీడియో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఓ గేమింగ్‌ యాప్‌‌ను సచిన్‌ ప్రమోట్‌ చేస్తున్నట్టుగా డీప్‌ఫేక్ టెక్నాలజీతో వీడియో సృష్టించిన సైబర్ నేరగాళ్లు..దాన్ని నెట్టింట పోస్ట్ చేశారు. అందులో త‌న కుమార్తె సారా టెండూల్కర్ దీని నుంచే రోజుకు రూ.1.8 లక్షలు సంపాదిస్తున్న‌ట్లు మాస్టర్ బ్లాస్టర్ చెప్తున్నట్లు ఉంది. అది కాస్తా వైరల్ అవ్వడంతో సచిన్‌ వెంటనే స్పందించారు.

వీడియో నకిలీదని, ఇలాంటివి తమ దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సచిన్‌ కోరారు. తాజాగా ఈ ఘటనలో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. సచిన్ వ్యక్తిగత సహాయకుడు రమేశ్ పార్డే ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన ముంబై సైబర్ సెల్ పోలీసులు ఓ గేమింగ్ సైట్ మరియు ఫేస్‌బుక్ పేజీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

భారత శిక్షాస్మృతి(IPC)లోని సెక్షన్ 500 (పరువు నష్టం) మరియు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఏ) (కమ్యూనికేషన్ ద్వారా అభ్యంతరకరమైన సందేశాలు పంపడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ గేమింగ్ యాప్ స‌ర్వర్లు విదేశాల్లో ఉన్నట్లు స‌మాచారం. అసలు నిందితులు విదేశాల్లో ఉంటూ భారత యువతను బెట్టింగ్ వైపు ద్రుష్టి మరల్చి డబ్బులు వెనకేసుంటున్నట్లు తెలుస్తోంది.