భార్యకు నకిలీ గిఫ్ట్.. కిలో బంగారంతో తాళిబొట్టు

భార్యకు నకిలీ గిఫ్ట్.. కిలో బంగారంతో తాళిబొట్టు

భారతదేశంలో ముఖ్యంగా హిందువులు తమ తాళిబొట్టుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఏదేమైనా తాళిబొట్టును మెడలోనుంచి తీయడానికి ససేమీరా ఒప్పుకోరు. తమకు ఉన్నంతలో ఎంతో కొంత బంగారంతో తాళిబొట్టు చేయించుకుంటారు. కాగా.. ఓ వ్యక్తి మాత్రం తన భార్య మీదున్న ప్రేమతో.. పెళ్లి రోజు సందర్భంగా  ఏకంగా కేజీ బంగారంతో చేసిన తాళిబొట్టును బహుమతిగా ఇచ్చాడు. ఇంకేముంది అతని భార్య ఆనందానికి హద్దే లేకుండాపోయింది. వెంటనే భర్త తెచ్చిన కానుకను మెడలో వేసుకొని భర్తతో సహా తెగ ఫోటోలు, వీడియోలు తీసుకుంది. అంతేనా.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫోటోలు, వీడియోలు కాసేపట్లోనే వైరల్‌గా మారాయి. ఈ విషయం కాస్తా పోలీసులకు తెలిసి సదరు వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించారు.

మహారాష్ట్రలోని బివాండీకి చెందిన బాలా అనే వ్యక్తి తన భార్యకు కేజీ బంగారంతో తయారుచేసిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. మోకాళ్ల వరకు పొడవున్న ఆ బంగారు మంగళసూత్రాన్ని ధరించి ఆమె, భర్తతో కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకుంది. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. దాంతో పోలీసులు బాలాను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బాలా చెప్పిన విషయం విని అంతా అవాక్కయ్యారు. తన భార్యకు కానుకగా ఇచ్చిన మంగళసూత్రం గిల్టుదని, దాన్ని ఓ బంగారు షాపు నుంచి రూ.38 వేలకు కొన్నట్లు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఎందుకైనా మంచిదని.. పోలీసులు బంగారు షాపు నిర్వాహకులను కూడా విచారించగా వారు కూడా అదే చెప్పడంతో పోలీసులు బాలాను విడిచిపెట్టారు. బంగారం ఉంది కదా అని అందరికీ తెలిసేలా చూపిస్తే.. దొంగలకు ఆహ్వనం పలకడమేనని పోలీసులు హెచ్చరించారు.