V6 News

గుజరాత్ గడ్డపై తిలక్‌‌‌‌ తాండవం.. 99 రన్స్ తేడాతో జీటీ‌‌‌పై ముంబై గ్రాండ్ విక్టరీ

గుజరాత్ గడ్డపై తిలక్‌‌‌‌ తాండవం.. 99 రన్స్ తేడాతో జీటీ‌‌‌పై ముంబై గ్రాండ్ విక్టరీ

అహ్మదాబాద్‌‌‌‌: గుజరాత్ గడ్డపై హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (45 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 నాటౌట్‌‌‌‌) గర్జించాడు. అదిరిపోయే ఆటతో.. ఖతర్నాక్ షాట్లతో  ఐపీఎల్‌‌‌‌లో తొలి సెంచరీతో విజృంభించాడు. తొలి 22 బాల్స్‌‌‌‌లో ఒక్క బౌండరీ లేకుండా19 రన్స్ మాత్రమే చేసి మొదట ఫ్యాన్స్‌‌‌‌ను విసిగించిన హైదరాబాదీ చివరి ఆరు ఓవర్లలో గుజరాత్ టైటాన్స్‌‌‌‌ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 

మరో 23 బాల్స్‌‌‌‌లో ఏకంగా 81 రన్స్‌‌‌‌తో  మోతెరా స్టేడియాన్ని ఉర్రూతళూగించడంతో ముంబై ఇండియన్స్‌‌‌‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో  99 రన్స్‌‌‌‌ తేడాతో గుజరాత్ టైటాన్స్‌‌‌‌ను చిత్తు చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఓ విజయం అందుకుంది. తొలుత ముంబై 20 ఓవర్లలో 199/5 స్కోరు చేసింది.

తిలక్‌‌‌‌తో పాటు నమన్ ధీర్ (32 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 45) రాణించాడు. జీటీ బౌలర్లలో కగిసో రబాడ (3/33) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో గుజరాత్ 15.5 ఓవర్లలో 100 రన్స్‌‌‌‌కే ఆలౌటై చిత్తుగా ఓడింది. వాషింగ్టన్ సుందర్ (26) టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ (4/24), శాంట్నర్ (2/16),  ఘజన్‌‌‌‌ఫర్ (2/17), బుమ్రా (1/15) సత్తా చాటారు. తిలక్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

తిలక్‌‌‌‌ తడాఖా

తిలక్‌‌‌‌ వర్మ అద్భుత సెంచరీతో విజృంభించడంతో ముంబై మంచి స్కోరు చేసింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. స్టార్టింగ్‌‌‌‌లో జీటీ బౌలర్లు సిరాజ్‌‌‌‌, రబాడ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫస్ట్ ఓవర్లో సిరాజ్ రెండు రన్సే ఇవ్వగా.. ఆ తర్వాత రబాడ తన వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. తొలుత కొత్త ఓపెనర్ డానిష్ మాలెవార్ (2)ను ఎల్బీ చేసిన అతను  ఇన్‌‌‌‌ఫామ్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌‌‌‌ (13)ను రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌తో వెనక్కుపంపాడు. 

ఆరో ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి ఊపు మీద కనిపించిన సూర్యకుమార్ (15)ను క్లీన్‌‌‌‌బౌల్డ్ చేయడంతో  పవర్‌‌‌‌‌‌‌‌లోనే 54/3తో ముంబై కష్టాల్లో పడింది. దాంతో ఆ టీమ్ తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందనిపించింది. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌‌‌‌‌కు తోడైన తిలక్ వర్మ జట్టును ఆదుకున్నాడు. తొలుత తను జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో రన్ జత చేయగా..  అశోక్ శర్మ బౌలింగ్‌‌‌‌లో  రెండు ఫోర్లు, సుందర్ వేసిన 11వ ఓవర్లో  6,4తో నమన్ ఇన్నింగ్స్‌‌‌‌ను గాడిలో పెట్టాడు.

ఫిఫ్టీ చేసేలా కనిపించిన అతడిని ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 51 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. 14వ ఓవర్లకు ముంబై 103/4తో నిలవడంతో ఆ జట్టు 170 స్కోరు చేస్తే గొప్పే అనిపించింది. అప్పటికి 22 బాల్స్‌‌‌‌లో ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 19 రన్స్ మాత్రమే చేసిన తిలక్‌‌‌‌ను అప్పటికే  స్టేడియంలోని  ఫ్యాన్స్‌‌‌‌ వెక్కిరిస్తున్నారు. ఈ క్రమంలో టైమౌట్‌‌‌‌లో  కెప్టెన్‌‌‌‌ పాండ్యా.. తిలక్‌‌‌‌కు ఏదో గట్టిగా చెబుతున్నట్టు కనిపించాడు. 

కెప్టెన్ ఏం చెప్పాడో గానీ తిలక్ ఒక్కసారిగా జోరు పెంచాడు. ప్రసిధ్ బౌలింగ్‌‌‌‌లో వరుసగా 6, 4, 4తో స్పీడు అందుకున్నాడు.  రషీద్ బౌలింగ్‌‌‌‌లో 6, 4 రాబట్టిన అతను అశోక్‌‌‌‌ శర్మ వేసిన 18వ  ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఖతర్నాక్ షాట్లతో వరుసగా 6, 4, 4, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించి 26 రన్స్‌‌‌‌ రాబట్టాడు. 

  సిరాజ్‌‌‌‌ వేసిన 19వ ఓవర్లో కెప్టెన్ హార్దిక్ ఔటైనా.. ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లో 4, 6, 6, 4 కొట్టి సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు భారీ స్కోరు అందించాడు. 33 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ కొట్టిన తిలక్  మరో 12 బాల్స్‌‌‌‌లోనే  సెంచరీ అందుకున్నాడంటే అతను ఏ రేంజ్‌‌‌‌లో విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. తిలక్ ధాటికి చివరి మూడు ఓవర్లలో ముంబై 58 రన్స్ రాబట్టింది.

జీటీ ఢమాల్

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ ముంబైకి పోటీ ఇవ్వలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓడిపోయింది. సీజన్‌‌‌‌ ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టని స్టార్ పేసర్ జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా ఈసారి ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌‌‌‌కే ఓపెనర్ సాయి సుదర్శన్ (0)ను గోల్డెన్ డకౌట్ చేసి జీటీ పతనాన్ని ఆరంభించాడు.
 
రెండో ఓవర్లో జోస్ బట్లర్ (5)ను కెప్టెన్ పాండ్యా ఎల్బీ చేసి మరో షాకిచ్చాడు.  అదే ఓవర్లో వాషింగ్టన్ సుందర్ మూడు ఫోర్లు కొట్టగా.. కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్ (14 ).. బుమ్రా బౌలింగ్‌‌‌‌లో రెండు ఫోర్లు కొట్టాడు. కానీ, ఐదో ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన లెఫ్టార్మ్ పేసర్ అశ్వనీ కుమార్ గిల్‌‌‌‌ను పెవిలియన్ చేర్చగా.. ఎనిమిదో ఓవర్లో స్పిన్నర్ శాంట్నర్ సుందర్‌‌‌‌‌‌‌‌తో పాటు హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ (6)ను ఔట్ చేయడంతో 55/5తో జీటీ ఎదురీత మొదలు పెట్టింది.

రాహుల్ తెవాటియా (8), షారూఖ్ ఖాన్ (17 ) కాసేపు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ, అద్భుతంగా బౌలింగ్ చేసిన అశ్వనీ కుమార్  11వ ఓవర్లో తెవాటియాను, ఆ వెంటనే రషీద్ ఖాన్ (4), షారూఖ్‌‌‌‌ను వెనక్కుపంపి ముంబై విజయం ఖాయం చేశాడు. ఘజన్‌‌ఫర్ బౌలింగ్‌‌‌‌లో రబాడ (12), సిరాజ్ (0) ఔటవడంతో గుజరాత్ పోరాటం 16 ఓవర్లలోనే ముగిసింది.

సంక్షిప్త స్కోర్లు:

ముంబై : 20 ఓవర్లలో 199/5 (తిలక్ వర్మ 101 నాటౌట్, నమన్ ధీర్ 45, కగిసో రబాడ 3/33).
గుజరాత్‌‌‌‌: 15.5 ఓవర్లలో 100 ఆలౌట్ (సుందర్ 26, షారుఖ్ 17, అశ్వనీ కుమార్ 4/24, శాంట్నర్ 2/16)