
- శానిటేషన్ పనులకే పరిమితం
పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా 60 రోజుల స్పెషల్ ప్లాన్ రూపొందిస్తున్నామని పంద్రాగస్టు ప్రసంగంలో సీఎం కేసీఆర్ చెప్పిన 15 రోజులకే ఆ ప్లాన్ను 30 రోజులకు కుదించారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో దాన్ని 15 రోజులకు.. అది కూడా శానిటేషన్ పనులకే పరిమితం చేశారు. గ్రామ పంచాయతీల్లో మాత్రం 30 రోజులపాటు అమలు చేయనున్నారు. మున్సిపాలిటీల్లో ప్లాన్ను కుదించడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులు చేసేందుకు రూపాయి కూడా ఇవ్వట్లేదు. భవిష్యత్‌లో ఇస్తామనే భరోసా కూడా రాలేదు. 15 రోజుల్లోగా అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో శానిటేషన్ మెరుగుపరచాలని ఎంఏయూడీ అధికారులు కమిషనర్లకు ఆదేశాలిచ్చారు.
15 రోజుల్లో మార్పు సాధ్యమా?
మొన్నటి వరకు పంచాయతీలుగా ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసినా వాటిలో పల్లె వాతావరణం అట్లాగే ఉంది. స్పెషల్ ప్లాన్‌తోనైనా వాటి రూపురేఖలు మారుతాయని ఆశించినా.. ఆ ప్లాన్ను కుదించడం, పైగా నిధులు ఇవ్వకపోవడంతో ఇప్పట్లో సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో గతంలో 68 మున్సిపాలిటీలుండగా మరో 60 పెద్ద పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఏడాది క్రితమే మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన బడంగ్‌పేట్, బండ్లగూడజాగీర్, మీర్‌పేట, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేటను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేశారు. గ్రేటర్ శివారులోని కొత్త కార్పొరేషన్లతో పాటు నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని 20 మున్సిపాలిటీలు మాత్రమే కాస్త అర్బన్ ప్రాంతాలుగా ఉన్నాయి. మిగతా 48 మున్సిపాలిటీల్లో సింగరేణి ప్రాంతంలో కొన్నింటిని మినహాయిస్తే 45 పక్కా పల్లెటూర్లు. జగిత్యాల జిల్లా రాయికల్ గతంలో మేజర్ పంచాయతీగా ఉండగా గతేడాది మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ 15,407 మంది జనాభా ఉండగా 18 మంది పారిశుధ్య కార్మికులే పనిచేస్తున్నారు. చాలా చోట్ల ఇలానే ఉన్నారు. రోజువారీ పనులు చేయడానికే వాళ్లకు సరిపోతుందని, ఇప్పుడు శానిటేషన్ స్పెషల్ ప్లాన్ సైతం వాళ్లే చేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. శానిటేషన్ పనుల నిర్వహణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నిధులు కేటాయించకపోవడం, కొత్త మున్సిపాలిటీల్లో పెద్దగా నిధులు లేకపోవడంతో ఈ పనులు ఎట్లా చేయాలో అధికారులకు అంతుపట్టడం లేదు. చాలా మున్సిపాలిటీలకు ఇన్‌చార్జి కమిషనర్లే ఉండటం, కొత్తగా సిబ్బందిని నియమించకపోవడంతో పనుల పర్యవేక్షణ ఎవరూ చేయాలనే విషయంలోనూ స్పష్టత లేదు.