- మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్‌విడుదల
- ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్‌కు ఎలక్షన్స్
మహబూబ్‌నగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. గత నెల సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన రాష్ర్ట ఎన్నికల సంఘం.. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 20 మున్సిపాలిటీలు, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఉండగా.. ఇందులో అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ముగియలేదు.
దీంతో ఈ రెండు మున్సిపాలిటీలు మినహా మిగిలిన18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని చోట్ల ఒకే విడతలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 18 మున్సిపాలిటీల్లో 318 వార్డులకు, కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు కలిపి ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి, 13న ఓట్లను లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల కోసం 971 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 6,18,516 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
నామినేషన్లకు మూడు రోజులే గడువు..
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు రెడీ అయ్యారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు మొదటి సారి ఎన్నిక జరుగుతుండడంతో.. కార్పొరేటర్లుగా గెలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి బీ ఫారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో డివిజన్లలో క్యాండిడేట్ల ఎంపిక ప్రధాన పార్టీలకు పెద్ద సమస్యగా మారింది. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ఉండడం.. మూడు రోజులే నామినేషన్ల దాఖలుకు డెడ్‌లైన్ పెట్టడంతో ఎవరిని ఎంపిక చేయాలనే టెన్షన్ లీడర్లలో మొదలైంది. ఒకరికి బీ ఫామ్ ఇప్పించి మరొకరిని పక్కన పెడితే పరిస్థితి ఏంటనే దానిపై చర్చ సాగుతోంది.
పన్నులు కట్టేందుకు క్యూ..
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యుల్ రిలీజ్ కావడంతో.. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల పెద్ద ఎత్తున మున్సిపల్, నగర పాలక సంస్థ ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు. నామినేషన్ వేయాలనుకునే క్యాండిడేట్లు మున్సిపాలిటీలకు ఎలాంటి బకాయి ఉండవద్దనే నిబంధన ఉంది. దీంతో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు వారి వారి పేర్ల మీద ఉన్న ఇంటి పన్ను, నల్లా బిల్లులు కట్టేందుకు మంగళవారం సాయంత్రం నుంచి ఆఫీసులకు చేరుకొని బకాయిలు కడుతున్నారు.
అమల్లోకి ఎన్నికల కోడ్..
ఎన్నికల షెడ్యుల్ రిలీజ్ కావడంతో మంగళవారం నుంచే ఎన్నికల్లో కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు రెండు వైపులా ఏపీ, కర్నాటక రాష్ర్టాలు ఉండడంతో నగదు, మద్యం అక్రమంగా రాకుండా అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రజలు రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లేందుకు వీలు లేదు. వివాహాలు, ఇతర అత్యవసర అవసరాలకు రూ.50 వేలకు పైగా డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తే అందుకు సంబంధించిన ఆధారాలు వెంట
ఉంచుకోవాలి
ఓటర్ల వివరాలు ఇలా..
మున్సిపాలిటీ/
కార్పొరేషన్ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
మహబూబ్‌నగర్ 97,636 1,00,191 14 1,97,841
దేవరకద్ర 4,909 5,161 00 10,070
భూత్పూర్ 5,975 6,089 00 12,064
నారాయణపేట 17,244 18,216 00 35,460
మక్తల్ 11,407 11,938 00 23,345
కోస్గి 10,028 10,219 01 20,248
మద్దూరు 6,171 6,530 00 12,701
