ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారానికి తెర..పంపకాలు షురూ!..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో  ప్రచారానికి తెర..పంపకాలు షురూ!..
  • ముగిసిన మున్సిపల్, కార్పొరేషన్​ ఎన్నికల ప్రచారం
  • చివరి రోజు పోటాపోటీగా ప్రచారాల్లో పాల్గొన్న ప్రధాన పార్టీల లీడర్లు
  • అభివృద్ధిపై లీడర్ల మధ్య మాటల యుద్ధం
  • ఓటర్లకు తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అయిన క్యాండిడేట్లు

మహబూబ్​నగర్, వెలుగు :  మున్సిపల్, కార్పొరేషన్​ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వం సోమవారం సాయత్రం 5 గంటలకు ముగిసింది. ఉమ్మడి మహబూబ్​నగర్​ లోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వారం రోజులుగా ఎన్నికల ప్రచారం సాగింది.  ప్రధాన పార్టీల క్యాండిడేట్లతో పాటు ఇండిపెండెంట్లు సైతం పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ తాము గెలిస్తే వార్డు లేదా డివిజన్​లో చేసే అభివృద్ధి గురించి వివరించారు.

కొందరు మ్యానిఫెస్టోను రూపొందించి పాంప్లెట్స్​ను పంపిణీ చేశారు. ప్రచారం చివరి రోజు ఆయా పార్టీల క్యాండిడేట్లకు మద్దతుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ లీడర్లు, ఇతర రాష్ట్ర స్థాయి లీడర్లు, మాజీ మంత్రులు  ప్రచారంలో పాల్గొన్నారు. 

ఆరోపణలు.. ప్రత్యారోపణలు

ఎన్నికల ప్రచారాల్లో అధికార పార్టీతో పాటు బీఆర్​ఎస్​, బీజేపీ లీడర్లు మున్సిపల్, కార్పొరేషన్​లో  కార్నర్​ మీటింగులు నిర్వహించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. కొందరు మీడియా సమావేశాలు నిర్వహించి వ్యక్తులను టార్గెట్​ చేస్తూ ఆరోపణలు చేయడం వారి మధ్య ఉన్న విబేధాలకు ఆజ్యం పోయినట్లైంది. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తికి సంబంధించిన అక్రమాలపై ప్రతి సవాల్​ విసరడం రాజకీయంగా వేడి రగిలించింది. ఎవరికి వారు తమ హయాంలోనే మున్సిపాల్టీలు అభివృద్ధి చెందాయని చెప్పుకుంటూ ప్రచారం 
చేశారు. 

గ్రామాల్లో లిక్కర్​ డంపులు

ఉమ్మడి జిల్లాలోని 316 వార్డులు, 60 డివిజన్​లకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పలు వార్డుల, డివిజన్లలో ప్రధాన పార్టీలకు చెందిన క్యాండిడేట్లు, ఇండిపెండెంట్ల మధ్య పోటాపోటీ నెలకొంది. దీంతో ప్రతి ఓటు కీలకం కావడంతో కొందరు తాయిలాలకు తెరలేపినట్ల తెలిసింది. గత రెండు రోజులుగా ఆయా వార్డులు, డివిజన్​లలో లిక్కర్​ పంపిణీని ప్రారంభించినట్టు సమాచారం. నగర, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్​ నేపథ్యంలో పోలీస్​ నిఘా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోని నమ్మకమైన వ్యక్తుల వద్ద క్యాండిడేట్లు లిక్కర్​ డంప్​లను ఉంచినట్లు తెలిసింది. అలాగే బెల్టు షాపుల్లో కూడా లిక్కర్​ నిల్వలు ఉంచినట్లు సమాచారం. నాలుగు రోజుల కిందట ఈ డంపులను ఆయా ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి ఓటర్లకు రహస్యంగా చేరవేస్తున్నట్లు తెలిసింది. 

ఓటుకు డిమాండ్​

పలువురు క్యాండిడేట్లు కరెన్సీ పంపిణీకి కూడా తెరలేపినట్లు సమాచారం. పోటీ ఎక్కువగా లేని వార్డుల్లో ఓటుకు రూ.500 వరకు పంచుతున్నట్లు తెలిసింది. త్రిముఖ పోటీ ఉన్న చోట రూ.2 వేలు, ద్విముఖ పోరు ఉన్న చోట్ల రూ.150‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చొప్పున ఓటుకు నోటు పంచుతున్నట్లు తెలిసింది. కొందరు ఆదివారం రాత్రి నుంచే ఈ ప్రక్రియకు తెరలేపినట్లు సమాచారం. మరికొందరు సోమవారం రాత్రి లేదా మంగళవారం రాత్రి నుంచి పంపకాలు చేసేందుకు నగదును సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.  

వలస కూలీలతో ఆత్మీయ సమ్మేళనం :  రాను పోను చార్జీలు, ఓటుకు డబ్బులు ఇస్తామని హామీలు

మున్సిపల్, కార్పొరేషన్​ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న క్రమంలో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఈ క్రమంలో క్యాండిడేట్లు వలస ఓట్లపై దృష్టి పెట్టారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని పోలింగ్​ తేదీ నాటికి మున్సిపాల్టీలకు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారభించారు. వలస కూలీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నారాయణపేట మున్సిపాల్టీలో 35,460 మంది ఓటర్లు ఉండగా, దాదాపు 12 వేల మంది ఓటర్లు ఉపాధి కోసం వలస వెళ్లారు.

చేనేత కార్మికులు 400 మంది షోలాపూర్​లో నేత పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకున్నారు. పలు కాలనీలకు చెందిన దాదాపు 500 మంది ముంబైలో రోజు వారి కూలీలుగా పనులు చేసుకుంటున్నారు. కర్నాటక రాష్ట్రంలోని శక్తినగర్​లో, ఇదే రాష్ట్రం యాద్గిర్​ ప్రాంతంలో మరో 600 మంది వివిధ పనులు చేసుకుంటున్నారు. ఈ ఓటర్లంతా ఆయా వార్డుల్లో కీలకంగా మారనున్నారు.  దీంతో క్యాండిడేట్లు వారితో సంప్రదింపులు ప్రారంభించారు.

వారం కిందట ఓ ప్రధాన పార్టీకి చెందిన క్యాండిడేట్​ ముంబైలో వలస కూలీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాడు. ఓటు వేసేందుకు పట్టణానికి రావాలని, చార్జీలను తాను భరిస్తానని చెప్పి అడ్వాన్స్​గా మనిషికి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చాడు. పోలింగ్​ తేదీ నాటికి వస్తే చార్జీలతోపాటు అదనంగా ఓటుకు రూ.2 వేలు, దావత్​ అరేంజ్​ చేస్తామని హామీ ఇచ్చాడు. అతడిని చూసి మూడు రోజులు కిందట మరో రెండు పార్టీలకు చెందిన క్యాండిడేట్లు వారి అనుచరులను ముంబైకి పంపించి వారు కూడా అదే హామీలు ఇచ్చారు. మొత్తంగా ఒక్కో వలస కూలీ మూడు పార్టీల నుంచి రూ.3 వేల చొప్పున అడ్వాన్స్​లు అందుకున్నాడు.

వారు మంగళవారం రాత్రి గానీ, బుధవారం ఉదయం గానీ ప్రత్యేక వాహనాల్లో ఆయా ప్రాంతాల నుంచి నారాయణపేటకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.హైదరాబాద్​, బెంగళూరు నుంచి వచ్చే వారికి కుడా ఇదేతరహా హామీలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఫలానా పార్టీ క్యాండిడేట్​కు మద్దతుగా పోలింగ్ రోజున ఊళ్లకు వచ్చి ఓటు వేసి వెళ్లాలని మాట్లాడిస్తున్నారు. ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల నుంచి కూడా వలస ఓటర్లకు ఫోన్​లు వెళ్తున్నాయి. హైదరాబాద్​ నుంచి వచ్చే వారికి రూ.వెయ్యి చార్జీలతో పాటు మరో రూ.వెయ్యి, బెంగళూరు నుంచి వచ్చే వారికి రూ.1500 చార్జీలతో పాటు కు అదనంగా రూ.1500 ఇస్తామని హామీలు ఇచ్చినట్లు సమాచారం