- మున్సిపాల్టీల్లో తిష్ట వేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
- వార్డులు, డివిజన్లకు ఇన్చార్జీలను నియమించిన ప్రధాన పార్టీలు
- మధ్యాహ్నం విందులు.. రాత్రిళ్లు మందుతో ఫుల్ కిక్
గద్వాల/నాగర్‌కర్నూల్/వనపర్తి, వెలుగు : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మున్సిపల్, కార్పొరేషన్ లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రతి వార్డులో సీరియస్‌గా క్యాంపెయిన్ చేస్తుండడంతో ప్రచారం పీక్స్‌కు చేరింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ప్రచార బాధ్యతలను భుజాన వేసుకోవడంతో పుర పోరు ఆసక్తికరంగా మారింది. పార్టీకి పట్టున్న ప్రాంతాలతో పాటు వీక్‌గా ఉన్న ఏరియాల్లో కార్నర్ మీటింగులు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో అభ్యర్థుల తరఫున ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
వార్డులు, డివిజన్లలో నేతల సందడి..
ప్రతీ వార్డు, డివిజన్లు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ప్రచారంతో సందడి మారుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలను కైవసం చేసుకునేందుకు గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ పావులు కదుపుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ హన్మంత్ రావు ప్రచారం పాల్గొంటుండగా, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత, వనపర్తి పుర పీఠాలను కైవసం చేసుకునేందుకు పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తుడి మేఘారెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి రోజూ ఆయా మున్సిపాల్టీల్లో పర్యటనలు చేస్తుండగా, బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకునేందుకు వార్డుల బాట పట్టారు.
నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూరు మున్సిపాల్టీలను దక్కించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు స్థానికంగా పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికార పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. మక్తల్, నారాయణపేట మున్సిపాల్టీల్లో మంత్రి శ్రీహరితో పాటు నారాయణపేట కాంగ్రెస్ ఇన్చార్జి కుంభం శివకుమార్ రెడ్డి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు.
ఈ నాలుగు మున్సిపాల్టీల్లో బీజేపీ తరఫున డీకే అరుణ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సి.లక్ష్మారెడ్డి ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్, దేవరకద్ర మున్సిపాల్టీలను దక్కింకునేందుకు స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ‘వన్ మెన్ ఆర్మీ’గా రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు.
మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి క్యాండిడేట్ల తరఫున ప్రచారం చేస్తూ కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రచారం చేయగా, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రతి డివిజన్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
ఇన్చార్జీల నియామకం
త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, రెండున్నరేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలెంజ్‌గా తీసుకున్నాయి. మెజార్టీ వార్డులు, డివిజన్లలో పాగా వేసి చైర్ పర్సన్, మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రతి ఓటు కీలకం కావడంతో ఆయా వార్డులు, డివిజన్లకు ఇన్చార్జీలను నియమించాయి.
ఆ ప్రాంతాలకు చెందిన పార్టీల మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇటీవల గెలుపొందిన పలువురు సర్పంచులకు బాధ్యతలను అప్పగించాయి. క్యాండిడేట్లు ప్రచార పర్వంలో పాల్గొంటుండగా, వీరంతా ఇంటర్నల్ డీలింగ్స్‌ను సెట్ చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న యూత్ లీడర్లను పలిపించి మాట్లాడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారికి ఫోన్లు చేసిన తమ క్యాండిడేట్‌కు మద్దతుగా ఓటు వేందుకు ఊళ్లకు రావాలని కోరుతున్నారు.
ఇందుకయ్యే ఖర్చులు కూడా చెల్లిస్తామని, ఓటింగ్ ముగిశాక దావత్ కూడా అరేంజ్ చేస్తామని హామీలు ఇస్తున్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న కుటుంబాల లిస్టును రూపొందించుకొని, వారిని నేరుగా వెళ్లి కలుస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఓట్ బ్యాంక్ ఉన్న నేతలను కలిసి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలకు తెరలేపారు.
మందు.. విందులు..
వార్డులు, డివిజన్లలోని ఆయా పార్టీల క్యాండిడేట్ల ఇండ్లు సందడిగా మారాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్‌తో పాటు రాత్రిళ్లు డిన్నర్లు, విందులు కూడా ప్రారంభం అయ్యాయి. కొందరు ఉదయం నుంచే ప్రచారంలో పాల్గొంటున్న వారికి లిక్కర్ సప్లయ్ చేస్తుండడంతో వారు తాగి ఊగుతూ ప్రచారాల్లో పాల్గొంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
