- ఇవాళ సాయంత్రంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లోజ్
- చివరి రోజు హోరెత్తించాలని అభ్యర్థుల ప్లాన్
- నేడు మధిరలో భట్టి, ఏదులాపురంలో పొంగులేటి రోడ్ షో
- సత్తుపల్లి, కల్లూరులో మంత్రి తుమ్మల ప్రచారం
ఖమ్మం, వెలుగు : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మైక్‌లు బంద్ కానున్నాయి. వారం, పది రోజుల నుంచి గల్లీ గల్లీలో వినిపిస్తున్న మైక్‌లు, డీజేల హోరుకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఒకవైపు ప్రచారం జరుగుతుండగానే ముందస్తుగానే ఓటర్లకు తాయిలాలు, గిఫ్టుల పంపిణీపై అభ్యర్థులు దృష్టిపెట్టారు. ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు మద్యం, చికెన్ తోపాటు స్వీట్ ప్యాకెట్లు, చీరలు, జాకెట్ పీసులు, బొట్టు బిల్లల ప్యాకెట్లు, గుర్తుతో కూడిన కీ చైన్లు.. ఇలా రకరకాల రూపాల్లో వస్తువులను కూడా అందిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో ఇప్పటికే డబ్బుల పంపకాలు కూడా మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీని ప్రారంభించగా, మరికొన్ని వార్డుల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవాళ హోరెత్తించడమే ప్లాన్..!
పది రోజుల నుంచి రసవత్తరంగా జరుగుతున్న ప్రచారాన్ని చివరి రోజు తారాస్థాయికి తీసుకెళ్లాలని ఆయా పార్టీల ముఖ్య నేతలు ప్లాన్ చేస్తున్నారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయగా, అంతకుముందు తాము మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ కొనసాగించింది తప్ప.. కొత్త పనులేవీ చేయలేదని బీఆర్ఎస్ లీడర్లు కౌంటర్ చేస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో సాగిన ప్రచారానికి సోమవారం భారీ ర్యాలీలు, రోడ్ షోలతో ముగింపు పలకాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ప్లాన్ చేస్తున్నారు.
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఏదులాపురంలోని ప్రధాన రహదారుల్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జిగా ఆ జిల్లాలో ప్రచార బాధ్యతలు చూసుకుంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చివరి రోజు ఖమ్మం జిల్లాలో ప్రచారానికి హాజరుకానున్నారు. ఈ ఎలక్షన్లలో తొలిసారిగా సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ర్యాలీ, కార్నర్‌మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చివరి రోజు సొంత నియోజకవర్గంలోని మధిర మున్సిపాలిటీలో ప్రచారం, రోడ్ షో
నిర్వహించనున్నారు.
మూడు రోజుల ముందే పంపకాలు..!
వైరాలో ఓటర్లకు మూడ్రోజుల ముందే రూ.500 అడ్వాన్స్, స్వీట్లు, చికెన్, చీరల పంపకాలు మొదలయ్యాయి. మిగిలిన అన్ని మున్సిపాలిటీలకూ పంపిణీ వ్యవహారం వ్యాపించింది. కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేస్తుండగా, ఆయా స్థానిక పరిస్థితులను బట్టి రూ.వెయ్యి నుంచి వైరాలో రూ.5 వేల వరకు పంపిణీ మొదలుపెట్టినట్టుగా సమాచారం. ఏదులాపురంలో కొన్ని చోట్ల రూ.2 వేల చొప్పున పంపిణీ ప్రారంభించారు. సీపీఎం, సీపీఐ అభ్యర్థులు బలంగా ఉన్న చోట ముందుగా వారే నగదు పంపిణీని ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ప్రచారంలో పాల్గొన్న వారికి రూ.400 చొప్పున ఇస్తూ మందు, బిర్యానీతో సరిపెడుతుండగా, ఈ క్యాంపెయిన్ ఖర్చులకు ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది.
