మున్సి‘పోల్స్’ ముంగిట కనిపించని కాంగ్రెస్ లీడర్లు

మున్సి‘పోల్స్’ ముంగిట కనిపించని కాంగ్రెస్ లీడర్లు

మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను జిల్లా కాంగ్రెస్ కమిటీలకు అప్పగించిన పీసీసీ ముఖ్య నేతలు.. ఆ ఎన్నికల వ్యూహరచనలకు దూరంగా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. కొందరు విదేశాలకు వెళ్లగా, మరికొందరు పీసీసీ చీఫ్  పదవి కోసం ఢిల్లీలో మకాం వేశారు. ఇంకొందరు రాహుల్ నిర్ణయంతో పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పార్టీ ఎంపీలైన కీలక నేతలు పార్లమెంట్ సమావేశాల్లో నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు పట్టుమని నెల కూడా లేని ఇంతటి కీలక సమయంలో రాష్ట్రస్థాయి కీలక నేతలు తమ జిల్లాలకు, క్యాడర్ కు దూరంగా ఉండటం పార్టీలో హాట్​టాపిక్​గా మారింది. ఈ పరిస్థితులు ద్వితీయ శ్రేణి నేతలను కలవరపరుస్తున్నాయి.

ముందే ‘వ్యూహం’ రచించినా..

వాస్తవానికి నెల రోజుల ముందే మున్సిపల్ ఎన్నికలపై పీసీసీ దృష్టి సారించింది. దీని కోసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో  వ్యూహ రచన కమిటీ ఏర్పాటైంది. ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి సభ్యులుగా ఈ కమిటీ మొదటి సమావేశం కూడా జరిగింది. డీసీసీలు, పట్టణ, నగర కమిటీలు సమావేశమై ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై చర్చించి పీసీసీకి నివేదికలు ఇవ్వాలని పీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అంతేకాదు జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో చర్చించి పోటీచేసే వారి పేర్లను ఇద్దరికి మించకుండా పీసీసీకి సిఫారసు చేయాలని కూడా  సూచించారు. దీంతో డీసీసీలు, టౌన్, సిటీ కమిటీలు పీసీసీ అప్పగించిన పనులు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యాయి. అయితే  ఇప్పుడు ఆ కమిటీలకు దిశానిర్ధేశం చేయాల్సిన పీసీసీ ముఖ్య నాయకులు ఎవరికి అందుబాటులో లేకుండాపోవడం పార్టీ కేడర్​ను ఆందోళనకు గురిచేస్తోంది.

అందుబాటులో లేని పెద్దలు

రాష్ట్ర కాంగ్రెస్  కీలక నేతల్లో ఒకరైన మల్లు భట్టి విక్రమార్క, మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాటైన పీసీసీ వ్యూహా రచన కమిటీ సారథి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ నేత మధు యాష్కీ వారం రోజుల నుంచి విదేశాల్లో ఉంటున్నారు. గతంలో పీసీసీ చీఫ్ లుగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్య, వి. హన్మంతరావుతోపాటు పీసీసీ చీఫ్​ పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న మరికొందరు నేతలు ఏఐసీసీ స్థాయిలో లాబీయింగ్ కోసం ఢిల్లీలోనే మకాం వేశారు. ఏఐసీసీలో బాధ్యతలు నిర్వర్తించిన కొందరు నేతలైతే ప్రస్తుతం గాంధీభవన్ కు రావడానికి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అంతగా ఇష్ట పడటం లేదు. రాహుల్​గాంధీ ఏఐసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పార్టీ పరిస్థితిపై అంతగా ఆశలు లేని సదరు నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పీసీసీలో మరో కీలక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా ఉన్నందున పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీకి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వీరు కూడా ఇటు రాష్ట్రస్థాయిలో, అటు నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ కు అందుబాటులో  ఉండే అవకాశం లేకుండా పోయింది. ఇటు టీఆర్ ఎస్ , అటు బీజేపీలు మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తుండగా.. ఇదే పనిని డీసీసీలకు ముందే అప్పగించిన పీసీసీ నేతలు మాత్రం క్యాడర్ కు దూరంగా ఉండడం పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో డీసీసీ అధ్యక్షులే కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు