
- మూడు మున్సిపాలిటీల్లో వార్డుల విభజనకు త్వరలో షెడ్యూల్
- రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్కు కులగణన వివరాలు
హైదరాబాద్, వెలుగు:
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలవగా.. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సైతం ఆ శాఖ అధికారులు రెడీ అవుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ముగియగానే డిసెంబర్ లేదా జనవరిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో వచ్చే నెల చివరి నాటికి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీలతోపాటు ఇస్నాపూర్, గజ్వేల్ మున్సిపాలిటీల్లోనూ వార్డుల విభజనకు కసరత్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అనుమతి రాగానే షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు.
ఓఆర్ఆర్ లోపలి మున్సిపాల్టీలకు మినహాయింపు
రాష్ట్రంలోని 160 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపారు. ఇందులో జీహెచ్ఎంసీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఉంది. మరో 10 మున్సిపాలిటీలకు గడువు ఇంకా పూర్తి కాలేదు. ఇక మిగిలిన 123 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 122 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వీటిలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే వీటన్నింటిలో ఇప్పటికే వార్డుల విభజనకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేశారు. జూన్ లో 30 మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల విభజన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో వార్డులను విభజన కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నారు. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీలో శివారు గ్రామాలను విలీనం చేయడంతో అక్కడ కూడా వార్డుల పునర్విభజన చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. మల్లన్నసాగర్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన కాలనీలు గజ్వేల్ మున్సిపాలిటీల్లోనే ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం వీటిని గ్రామపంచాయతీ కేటగిరిలో పెట్టడంతోపాటు ఎన్నికలు కూడా నిర్వహించింది.
అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉండి గ్రామపంచాయతీగా పరిగణించడం సరికాదని ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇప్పటికే వార్డుల విభజన పూర్తిచేసిన గజ్వేల్ లో కూడా కొత్త కాలనీల నేపథ్యంలో వార్డులను పునర్విభజన చేయాలని అధికారులు భావిస్తున్నారు. వార్డుల విభజనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సీడీఎంఏ అధికారులు లేఖ రాశారు. ఈ వారం లేదా వచ్చే వారం ప్రభుత్వం అనుమతి ఇస్తుందని మున్సిపల్ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. అనుమతి రాగానే షెడ్యూల్ రిలీజ్ చేస్తామన్నారు. మూడు మున్సిపాలిటీల్లో వార్డుల విభజనకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకోవటానికి నెల సమయం పడుతుందని వెల్లడించారు.
రిజర్వేషన్లపై కసరత్తు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ ఖరారు చేయనుంది. ఇందుకు ప్రభుత్వం చేపట్టిన కులగణన వివరాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందుకు ప్లానింగ్ డిపార్ట్ మెంట్ నుంచి వివరాలను తీసుకొని బీసీ డెడికేటెడ్ కమిషన్ కు మున్సిపల్ అధికారులు అందజేయనున్నారు. ఈ వివరాలు అందించాలని ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు మున్సిపల్ అధికారులు లేఖ రాశారు. ఆ వివరాలు రాగానే డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. ఈ ప్రాసెస్ కూడా వచ్చే నెలాఖరు వరకు పూర్తి కానుందని అధికారులు చెబుతున్నారు.