- మళ్లీ సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు
- మెజార్టీ స్థానాల కోసం బీజేపీ యత్నం
- ప్రధాన పార్టీల ఫోకస్ అంతా కామారెడ్డి పైనే
కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పట్టణాల్లో ఆధిపత్యం చెలాయించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లు తమకు అనుకూలంగా ఉంటారని ప్రతి పార్టీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్‌కుంద మున్సిపాలిటీలపై జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ మళ్లీ సత్తా చాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మెజార్టీ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, బలమైన నేతల గుర్తింపుపై దృష్టి సారించాయి.
కాంగ్రెస్ కసరత్తు..
రెండేండ్ల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారడంతో కామారెడ్డి మున్సిపల్‌లో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ద్వారా పాలన చేపట్టింది. అధికారంలో ఉన్నందున మున్సిపల్ఎన్నికల్లో ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతారని కాంగ్రెస్ భావిస్తోంది. ఎల్లారెడ్డి, బిచ్‌కుందలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటంతో పాటు, కామారెడ్డి, బాన్సువాడల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వల్ల తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎత్తుగడ..
గత మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాలు సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. ఈసారి కూడా మళ్లీ దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లోనూ మెజార్టీ సీట్లు తమవేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మెజార్టీ స్థానాల కోసం బీజేపీ యత్నం..
మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించేందుకు బీజేపీ యత్నిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, ఈసారి తమ వైపు మొగ్గు చూపుతారని బీజేపీ ఆశిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్ శాతం మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
ఫస్ట్ టైం బిచ్‌కుంద... ఎవరి వైపు ప్రజలు?
మేజర్ పంచాయతీగా ఉన్న బిచ్‌కుంద ఇటీవల మున్సిపాలిటీగా మారడంతో తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం స్పెషల్ఫోకస్పెట్టాయి.
ఫోకస్ అంతా కామారెడ్డి పైనే..
అన్ని పార్టీల దృష్టి కామారెడ్డి మున్సిపాలిటీపైనే ఉంది. 49 కౌన్సిలర్ స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 23, కాంగ్రెస్ 12, బీజేపీ 8, ఇండిపెండెంట్లు 6 స్థానాల్లో గెలిచారు. ఇండిపెండెంట్లు బీఆర్‌ఎస్‌లో చేరడంతో చైర్మన్ పదవిని ఆ పార్టీ దక్కించుకుంది. అనంతరం పలువురు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు కూడా గులాబీ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో చివరి ఏడాది మున్సిపాలిటీని కాంగ్రెస్ పాలించింది. ఈసారి మెజార్టీ సీట్లు సాధించేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అగ్రనేతలను కాదని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణరెడ్డిని గెలిపించారు. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ బీజేపీకి గణనీయమైన ఓట్లు వచ్చాయి. ఈ ఒరవడి మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని బీజేపీ భావిస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే ఈసారి గెలుపు ఖాయమని బీఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
