మున్సిపల్ రిజల్ట్.. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రౌండ్లలో ఫలితాలు

మున్సిపల్ రిజల్ట్.. ఆదిలాబాద్  జిల్లాలో  రెండు రౌండ్లలో ఫలితాలు
  •     నేడే మున్సిపల్​ ఎన్నికల ఫలితాలు
  •     తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
  •     కౌంటింగ్​కు ఏర్పాట్లు పూర్తి
  •     ఒక్కో రౌండ్​లో వెయ్యి ఓట్లు లెక్కింపు

మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: మున్సిపల్​ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా సెంటర్లలో శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభించనున్నారు. మంచిర్యాల కార్పొరేషన్​తో పాటు బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల రిజల్ట్​ రెండు రౌండ్లలోనే వెల్లడయ్యే అవకాశముంది. మంచిర్యాల కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో చేపడుతున్నారు. 60 వార్డులకు 60 టేబుల్స్ ఏర్పాటు చేసి రౌండ్​కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. 

కౌంటింగ్​ ఇలా... 

ముందుగా డివిజన్​, వార్డు పరిధిలోని పోలింగ్​స్టేషన్లలో పోలైన ఓట్లను కౌంట్ ​చేసిన తర్వాత ఆ ఓట్లన్నీ కలుపుతారు. అనంతరం 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టి గుర్తుల వారీగా రౌండ్​కు వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. ఏదైనా డివిజన్​లో 2 వేల కంటే ఎక్కువ ఓట్లు పోలైతే మూడో రౌండ్​ కౌంట్ ​చేస్తారు. మున్సిపాలిటీల ఓట్లను సైతం ఇదే పద్ధతిలో లెక్కిస్తారు. మంచిర్యాల కార్పొరేషన్ ఓట్ల కౌంటింగ్ కోసం అదనపు సిబ్బందితో కలిపి 66 మంది కౌంటింగ్ సూపర్​వైజర్లు, 132 మంది కౌంటింగ్ సహాయకులను నియమించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు సంబంధించి 49 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. 

కౌంటింగ్​ కేంద్రాలు ఇవే..

బెల్లంపల్లి మున్సిపల్ ఓట్ల కౌంటింగ్​ సెంటర్​ను బజార్ ఏరియాలో గల జడ్పీ హైస్కూల్​లో ఏర్పాటు చేశారు. చెన్నూర్ మున్సిపల్ ఓట్ల లెక్కింపు స్థానిక జడ్పీ హైస్కూల్​లో జరుగుతుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి సూపర్ బజార్ ఏరియాలోని సింగరేణి క్లబ్​లో, లక్సెట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఓల్డ్​ ఎంపీడీవో ఆఫీస్​లో ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్​ కుమార్​ దీపక్ తెలిపారు. ఆదిలాబాద్​ మున్సిపాలిటీ కౌంటింగ్​ సెంటర్​ను టీటీడీసీలో ఏర్పాటు చేయగా కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్‌‌తో కలిసి కలెక్టర్​ రాజర్షి షా పరిశీలించారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కౌంటింగ్ సెంటర్​ను జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్​లో, కాగజ్ నగర్ మున్సిపాలిటీ కౌంటింగ్​ను పట్టణంలోని డీఏవీ స్కూల్​లో ఏర్పాటు చేశారు. కలెక్టర్ కె.హరిత కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు. నిర్మల్ మున్సిపాలిటీ కౌంటింగ్​ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ భవనంలో ఏర్పాటు చేశారు.


మొదలైన క్యాంపు రాజకీయాలు

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల తీరును చూస్తే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిజీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ లేదా ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టాయి. ఎన్నికలు ముగియగానే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించింది.  ఏ పార్టీకి మెజార్టీ రాని పక్షంలో అనుసరించాల్సిన వ్యూహలపై ఆయా పార్టీలు చర్చిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ సైతం అభ్యర్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి కీలక సూచనలు చేసినట్లు సమాచారం. మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఎవరి అభ్యర్థులను వాళ్లు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రత్యేక వాహనాల్లో క్యాంప్​కు తరలించారు.