మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో ఆఫీసర్ల లీలలు

మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో ఆఫీసర్ల లీలలు
  • పాలకవర్గం మెప్పుకోసం పనుల పంపకాలు
  • ఎమర్జెన్సీ పేరిటనామినేషన్ పైనే లక్షల వర్క్స్
  • ఎంబీ రికార్డులు అక్కర్లేకుండా ఓచర్ పేమెంట్స్​ ఖజానాకు నష్టం ..
  • క్వాలిటీ ప్రశ్నా ర్థకం

కరీంనగర్​ కార్పొరేషన్​లో  60 మంది కార్పొరేటర్లకు ఇటీవల రూ.30 లక్షలతో సెల్​ఫోన్లు కొనేందుకు కొటేషన్​కు వెళ్లారు. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్) లో పరికరాలు కొనేందుకు మాత్రమే కొటేషన్​కు వెళ్లాలి. అదీగాక బల్దియాల్లో ఐటీకి సంబంధించిన ఏ పరికరాలైనా ఐటీ కార్పొరేషన్ ద్వారానే కొనాలని గతంలో ఆ  శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.  కానీ ఇక్కడ అలాంటి రూల్స్​ను పట్టించుకోవడం లేదు.

కరీంనగర్, వెలుగురాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికార పార్టీదే పైచేయి కావడం,  ప్రశ్నించేవారు లేకపోవడంతో పలుచోట్ల గవర్నింగ్​బాడీలు, ఆఫీసర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. ఈ ఏడాది పట్టణ ప్రగతి కింద నగరాలు, పట్టణాల్లో కోట్లు విలువజేసే అభివృద్ధి పనులు జరిగాయి. లక్ష పైన విలువైన పనులన్నీ టెండర్ల ద్వారా పిలవాల్సి ఉన్నప్పటికీ చాలా బల్దియాల్లో పనులను డివైడ్​ చేసి నామినేషన్​ పేరిట పంచుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లక్ష చిన్నమొత్తం కాబట్టి ఎమర్జెన్సీ వర్స్​పేరిట  రూ.5 లక్షలు, అంతకుమించి బిట్లుగా చేసి అధికార పార్టీ లీడర్లు,  వారి అనుయాయులకు కట్టబెడుతున్నారు. ఈ క్రమంలో మున్సిపల్​ రూల్స్​  బ్రేక్​ చేస్తున్నారు.

డివైడ్​ అండ్​ డిస్ట్రిబ్యూట్​

బల్దియాల్లో రూ. లక్ష దాటిన  పనులకు రూల్​ ప్రకారం టెండర్లు పిలవాలి. కమిషనర్ కి రూ. 5 లక్షల వరకు పరిమితి ఉంటుంది. కానీ చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో టెండర్లు లేకుండానే పనులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పట్టణ ప్రగతిలో భాగంగా  చేసిన డెలవప్​మెంట్​ వర్క్స్​ జరిగిన తీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఒక్క కరీంనగర్​ కార్పొరేషన్​లోనే  సుమారు రూ. 40 లక్షల పట్టణ ప్రగతి పనులను టెండర్లు లేకుండా నామినేషన్​ పద్ధతిలో దక్కించుకున్నారు. స్థలాలను చదును చేయడం వంటి పనుల్లో జేసీబీలకు బదులు కొన్నిచోట్ల బైకులు, ఆటోల నంబర్లను రాసుకున్నారు. ఇటీవల పట్టణాలు, నగరాల్లో చేపట్టిన హరితహారం పనుల్లోనూ ఇదే తంతు జరిగింది. కరీంనగర్​కార్పొరేషన్​లో ఏకంగా రూ. 2.5 కోట్లు   పనులను నామినేషన్​ పద్ధతిలో దక్కించుకున్నారు. 60 డివిజన్లలో గుంతలు తవ్వడం, మొక్కలు నాటే పనులను  డివైడ్ చేసి పంచుకున్నారు. వేర్వేరు వ్యక్తులకైనా ఇచ్చారా అంటే అదీ లేదు. అన్ని కలిపి ఒకే వ్యక్తికి కట్టబెట్టారు. గతంలోనూ సిల్ట్ తీసే పనులను నామినేషన్​ పద్ధతిలో అప్పగించే ప్రయత్నం చేయగా, పత్రికల్లో వార్తలు చూసి టెండర్లు పిలిచారు. కార్పొరేషన్ లో 90 శాతం పనులు టెండర్లు లేకుండానే చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఓచర్లు.. కొటేషన్లు

బల్దియాల్లో మరో విచిత్రం ఏమిటంటే ఓచర్ల ద్వారా వివిధ రకాల పేమెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఒక పనికి టెండర్ పిలిచి, పనులు పూర్తయ్యాక ఎంబీ రికార్డు చేసి క్వాలిటీ కంట్రోల్ అధికారులు అప్రూవల్ చేసిన తర్వాత పేమెంట్స్​ చేస్తారు. అదీ సదరు కాంట్రాక్టర్ అకౌంట్ లోనే క్రెడిట్ అవుతాయి. కానీ ఇక్కడ పనులకు టెండర్లే లేవాయే, దీంతో యథేచ్ఛగా ఓచర్ల ద్వారానే పేమెంట్లు చేస్తున్నారు. సాధారణంగా బల్దియాలో జీతభత్యాలు, కరెంటు బిల్లులు, చిన్న చిన్న పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు ఓచర్లు వినియోగిస్తారు. కానీ పెద్దపెద్ద పనులకు కూడా ఓచర్​ పేమెంట్​చేస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. గడిచిన ఆరు నెలల్లో కరీంనగర్​ కార్పొరేషన్​లో  సుమారు రూ. 75లక్షల వరకు(జీతభత్యాలు కాక) ఓచర్ పేమెంట్స్ చేశారు. అందువల్ల నామినేషన్​పనుల్లో క్వాలిటీ అడిగేవారుగానీ, ఎంబీ రికార్డులు సమర్పించాల్సిన పనిగాని లేకపోవడంతో అన్నిచోట్లా ఇదే పని చేస్తున్నారు. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్) బుక్​లో లేని పరికరాలను మాత్రమే బయట కొటేషన్​ ఇచ్చి తెచ్చుకోవాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా సెల్​ఫోన్లలాంటివి కూడా కొనుగోలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

కొన్ని మున్సిపాలిటీల్లో జనవరి నుంచి ఆగస్టు వరకు ఇలా.. 

  • సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో గడిచిన 8 నెలల్లో  రూ. 32 లక్షల విలువైన 42 పనులను నామినేషన్ పద్ధతిలో చేపట్టారు. ఇందులో మురికి కాల్వల పూడికతీత, పాత బావుల పూడ్చివేత, పాత ఇళ్ల కూల్చివేత, ఖాళీ స్థలాల చదును, కల్వర్టుల నిర్మాణం, మురికి కాల్వల రిపేర్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై లాంటి పనులున్నాయి.
  • జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో 8 నెలల్లో ఏకంగా రూ.59.53 లక్షల పనులు నామినేషన్​ పద్ధతిలో చేశారు. ఇందులో పబ్లిక్ టాయిలెట్స్ కోసం రూ.41.13 లక్షలు పెట్టారు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కింద నిర్మిస్తున్న టాయిలెట్లన్నింటినీ నామినేషన్ పద్ధతినే అప్పగించారు. ఒక్కో వర్క్ సుమారు రూ.12 లక్షల చొప్పున 20 టాయిలెట్ బాక్ బ్లాకులను నిర్మిస్తున్నారు.
  • మధిర మున్సిపాలిటీలో నామినేషన్ పద్ధతిలో 35 లక్షల విలువైన పనులు జరిగాయి.
  • నిర్మల్ మున్సిపాలిటీలో జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.50 లక్షల పనులు నామినేషన్ పద్ధతిలో చేశారు.
  • సూర్యాపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలో పట్టణ ప్రగతి కింద రూ.1.51కోట్ల పనులను నామినేషన్​ పద్ధతిలో చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో పట్టణప్రగతి కోసం కేవలం నామినేషన్ పద్ధతిలో రూ. 33.10 లక్షల పనులు,  టాయిలెట్స్ నిర్మాణం కోసం రూ.57.70 లక్షల పనులు చేశారు.
  • హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఈ ఏడాది జనవరి నుంచి ఏకంగా రూ. 45 లక్షల విలువ గల వర్క్ ను నామినేషన్ పద్ధతిలో చేశారు.
  • కోదాడ మున్సిపల్ పరిధిలో రూ. 53లక్షలతో, తిరుమలగిఈరి మున్సిపాలిటీ లో రూ.56 లక్షలు నామినేషన్​ పద్ధతిలో అప్పగించారు.

ఇక్కడ కాస్త డిఫరెంట్

మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్, ఆసిఫాబాద్​ జిల్లాల్లో పరిస్థితి కాస్త భిన్నం గా ఉంది. ఆదిలాబాద్​ మున్సిపాలిటీలో పనులను నామినేషన్ పద్ధతిలో కాకుండా చిన్నచిన్న పనులన్నిం టినీ ప్యాకేజీలా విభజించారు. రోడ్లు, డ్రైనేజీ లు, కల్వర్టుల నిర్మాణానికి సంబంధించి రూ. 1.47 కోట్ల విలువైన 49 పనులను ఒకే ప్యాకెజీగా టెండర్​ పిలిచి అప్పగించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలి టీలోనూ ఇదే సీన్​ కనిపించింది. 8 నెలల్లో రూ.52.68 లక్షల వర్క్స్ చేపట్టినా ఏ ఒక్క పనినీ నామినేషన్​కు ఇవ్వలేదు. టెండర్లు పిలవడం వల్ల 15 పర్సెంట్​దాకా లెస్​కు ఇచ్చే చాన్స్​ ఉంది. కానీ నామినేషన్ విధానంలో  5శాతం లెస్​కు మాత్రమే అప్పగించడం వల్ల ఆమేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టమే. కానీ తమ వారికి పనులు ఇప్పించుకునేందుకు లీడర్లు, కమీషన్ల కోసం ఆఫీసర్లు టెండర్లకు వెళ్లకుండా నామినేషన్​, కొటేషన్​ విధానాలకు వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఫొటో చూడండి. కరీంనగర్​ ఎస్ఆర్ఆర్ కాలేజీ రోడ్ లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి  తవ్విన గుంతలివి. గతంలోనే  డ్రైన్ పక్కనే  మొక్కలు నాటారు. వీటికి ఆనుకునే మళ్లీ ఇలా గుంతలు తీశారు. వీటిలోనూ మొక్కలు నాటుతారట! పైగా ఈ గుంతల తవ్వకానికి ఎలాంటి టెండర్​ పిలవలేదు. ఈ పనులను ‘ఎమర్జెన్సీ’ కింద  మున్సిపల్ ఆఫీసర్లు నామినేషన్ పద్ధతిలో తమకు కావాల్సిన వారికి కేటాయించుకున్నారు. మొక్కలకు గుంతలు తవ్వడం ఎలా ఎమర్జెన్సీ అవుతుందో ఆఫీసర్లకూ, గవర్నింగ్​బాడీ పెద్దలకే తెలియాలి. పైగా ఓచర్​పేమెంట్స్​చేస్తున్నారు కాబట్టి ఎంబీ రికార్డ్స్​తో పనిలేదు.. క్వాలిటీ అడిగేవారే లేరు.