ఫిబ్రవరి 10 తర్వాత విలీన జీవో? ..కౌన్సిల్ గడువు ముగిసిన తర్వాతే ఉత్తర్వులు

ఫిబ్రవరి 10 తర్వాత విలీన జీవో? ..కౌన్సిల్ గడువు ముగిసిన తర్వాతే ఉత్తర్వులు
  • ఇప్పటికే  ప్రియంబుల్ ప్రతిపాదనలకు ఆమోదం 
  • మున్సిపాలిటీల్లో మొదలుకానున్న ప్రక్రియ
  • త్వరలో పెండింగ్ బిల్స్ క్లియరెన్స్​ భూముల రికార్డులు తయారు  
  • రికార్డులు ఫైనలయ్యాక జీహెచ్ఎంసీకి హ్యాండోవర్

హైదరాబాద్ సిటీ, వెలుగు:శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి సంబంధించిన జీవో  వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 తర్వాత విడుదల కానున్నట్లు తెలిసింది. బల్దియా కౌన్సిల్ గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఆ తర్వాతే ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

నిజానికి, విలీనానికి సంబంధించిన ‘ప్రియంబుల్ ప్రతిపాదనల’కు కౌన్సిల్ ఇప్పటికే ఆమోదం తెలపడంతో బదిలీ ప్రక్రియ మొదలైంది. విలీనానికి ముందు ఆయా అర్బన్, లోకల్ బాడీల ఆస్తులు, అప్పులు, ఆదాయ వివరాలను జీహెచ్ఎంసీకి సమర్పించాలి. 

కరెంట్, వాటర్ తదితర పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి ఖాళీగా ఉన్న భూముల రికార్డులు తయారు చేయాలి. ప్రభుత్వ భూముల పంచనామ చేసి,  నో డ్యూస్ లో వివాదాలుంటే కేసుల పూర్తి వివరాలతో రికార్డులు తయారు చేయాలి. ఆస్తి పన్ను ఎంత వస్తోంది?  ఎన్ని బకాయిలున్నాయి? అన్న వివరాలు కూడా రెడీ చేసి జీహెచ్ఎంసీకి హ్యాండోవర్  చేయాలి. 

కన్​స్ట్రక్షన్​అనుమతులు, ఉద్యోగుల సర్వీసు రికార్డులతో పాటు ఇతర అన్నిరకాల ఫైళ్లను అప్పగించాలి. వీటి రశీదులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించాలి. లోకల్ బాడీలో చేపట్టిన అభివృద్ధి పనుల పూర్తి సమాచారం, భవిష్యత్​లో చేయాల్సిన పనులు, ప్రతిపాదనల స్టేజీలో ఉన్న అభివృద్ది పనులకు సంబంధించిన వివరాలను కూడా బల్దియాకు అప్పగించాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు 30 నుంచి 60 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. 

ఈ ఏడాది జీహెచ్ఎంసీ వరకే బడ్జెట్...

 వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ తయారు చేయనున్న బడ్జెట్ విలీనమయ్యే  స్థానిక సంస్థలు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని రూపొందించాల్సి ఉంటుంది. 

కానీ, విలీన ఉత్తర్వులు కౌన్సిల్  గడువు ముగిసిన తర్వాత వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పుడు జీవో ఇస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలుంటాయంటున్నారు. అందుకే కౌన్సిల్ గడువు ముగిసిన రత్వాత స్పెషల్ ఆఫీసర్ కి బాధ్యతలు అప్పగించే జీవోతో పాటు విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో  ప్రస్తుత కౌన్సిల్ 2026–27 ఆర్థిక సంవత్సారానికి సంబంధించి ఇప్పుడున్న జీహెచ్ఎంసీ వరకే  బడ్జెట్ కి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.