హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ మొదటి లేదా రెండో వారంలోనే జరగవచ్చని, ఎలక్షన్ కు దాదాపు 40 రోజుల టైమ్ మాత్రమే ఉన్నందున ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ సంస్థాగత ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. నాయకులు ఎప్పటికప్పుడు ఓటర్లను కలుస్తూ ఉండాలని చెప్పారు. ఈ నెల10లోపు బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలని, ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు కనీసం ఒక్కో ఇంటికి నాలుగైదుసార్లు పోవాలన్నారు. శనివారం హైదరాబాద్, బండ్లగూడలో మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశానికి బన్సల్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. సమావేశంలో కమిటీ కోఆర్డినేటర్ మనోహర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, స్వామిగౌడ్, దుగ్యాల ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యులకు బన్సల్ పలు సూచనలు చేశారు. ఉప ఎన్నిక షెడ్యూల్ కు ముందు, ఆ తర్వాత ఏం చేయాలనేది వివరించారు. బూత్ కమిటీల్లో కొత్త, పాత కార్యకర్తలకు చోటు కల్పించాలని, కనీసం 10 నుంచి 20 మందితో కమిటీలు పూర్తి చేయాలన్నారు.
ఇన్చార్జ్లు అక్కడే మకాం వేయాలె
స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాత పార్టీ మండల ఇన్చార్జ్లు, సహ ఇన్చార్జ్లతోనూ బన్సల్ సమావేశమయ్యారు. ఆ తర్వాత బై ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీలతో కూడా భేటీ అయ్యారు. నాయకులను ఓ వైపు అప్రమత్తం చేస్తూనే ఇంకో వైపు బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. ఇన్చార్జ్లు తమకు కేటాయించిన మండలాల్లోనే మకాం వేయాలని చెప్పారు. ఎన్నికలు ముగిసే వరకు మండలం దాటి రావద్దన్నారు. ఇప్పటివరకు అక్కడ నిర్వహించిన కార్యక్రమాలు, అమలు చేసిన వ్యూహాల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు.
టీఆర్ఎస్కు చెక్ పెట్టాలె
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినందున ఓటర్లు కన్ఫ్యూజన్ కాకుండా ఉండేందుకు కమలం గుర్తును బాగా ప్రచారం చేయాలని బన్సల్ సూచించారు. ‘‘టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది. అంబులెన్సులలో డబ్బులు పంపిణీ చేసే కుట్రలకు ఆ పార్టీ తెరలేపుతుంది. పోలీసులను తమకు అనుకూలంగా పని చేయించుకుంటుంది. ఇలాంటి అన్ని విషయాలపై నిఘా వేయాలి. గత ఉప ఎన్నికలో టీఆర్ఎస్ చేసిన అధికార దుర్వినియోగాన్ని గుర్తించి, ఇప్పుడు దానికి చెక్ పెట్టేలా ప్లాన్ చేసుకోవాలి” అని చెప్పారు. సర్కార్ ఫెయిల్యూర్స్, సీఎం కేసీఆర్ అవినీతి, నియంతృత్వ, కుటుంబపాలనపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోడీ పాలన గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మారుస్తుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపుకు ఇదే నాంది కావాలన్నారు.
