నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక

నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక

ఢిల్లీ : మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు విడుదల చేసింది. అక్టోబర్ 7న నోటిఫికేషన్ వెలువడనుండగా.. నవంబర్ 3న ఉప ఎన్నిక ఉంటుందని ప్రకటించింది. పార్టీల అభ్యర్థులు నామినేషన్లు  అక్టోబర్ 14 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 17. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణ (మునుగోడు) తో పాటు  మరో   ఐదు రాష్ట్రాల్లోని (మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సా) పలు స్థానాల్లో బై పోల్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ  రిలీజ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేయడంతో మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన మునుగోడు బై పోల్‌ను  రాష్ట్రంలోని  ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సాధారణంగా ఉప ఎన్నికల సందర్భాల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావుడి ఏర్పడుతుంది. కానీ మునుగోడు విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ అప్పటి నుంచే ప్రచారం ప్రారంభించాయి. బీజేపీ ఈ ఎన్నికను సవాల్ గా తీసుకుంది. అక్కడి నుంచి  మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దింపింది. ప్రచారం కోసం పార్టీ అగ్రనేతలను రంగంలోకి దింపి గెలుపు వ్యూహాలను రచిస్తోంది. మునుగోడులో బీజేపీ గెలిస్తే.. తెలంగాణలో అధికార మార్పు ఖాయమని చెబుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మునుగోడు బై పోల్ కు తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మునుగోడు సీటును ఖాతాలో వేసుకునే కృత నిశ్చయంతో సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే మునుగోడు అభ్యర్థిపై టీఆర్ఎస్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.