దుబ్బాక, హుజూరాబాద్ లెక్క మునుగోడు ప్రజలు మోసపోవద్దు: హరీశ్

దుబ్బాక, హుజూరాబాద్ లెక్క మునుగోడు ప్రజలు మోసపోవద్దు: హరీశ్

హైదరాబాద్‌‌, వెలుగు: బీజేపీ ఇచ్చేవన్నీ జుమ్లా హామీలేనని, ఆ పార్టీ చెప్పేవన్నీ ఝూటా మాటలేనని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌‌లోనే రూ.750 పింఛన్‌‌ ఇచ్చేటోళ్లు.. ఇక్కడ గెలిపిస్తే రూ.3 వేల పింఛన్ ఎలా ఇస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. 

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రూ.3 వేల పింఛన్‌‌‌‌ ఇవ్వాలని.. ఇదే హామీని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌ షా ఇవ్వాలని మంత్రి హరీశ్ డిమాండ్‌‌‌‌ చేశారు. ‘‘దుబ్బాక, హుజూరాబాద్‌‌‌‌, జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ ఇలాంటి బూటకపు హామీలే ఇచ్చి మాట తప్పింది.  ఇప్పుడు మునుగోడులోనూ అలాంటి హామీలతోనే గెలవాలని ప్రయత్నిస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్‌‌‌‌ ప్రజల లెక్కనే మునుగోడు ప్రజలు బీజేపీ జూటా మాటలు, జుమ్లా హామీలు నమ్మి మోసపోవద్దు” అని సూచించారు. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల నాటి నుంచి హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నిక వరకు బీజేపీ నాయకులు ఇచ్చిన జూటా హామీలపై వీడియో రూపొందించామని, మునుగోడులో ప్రతి ఇంటికీ వెళ్లి దాన్ని ప్రజలకు చూపిస్తామని చెప్పారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌‌‌‌ రెడ్డిది ఆత్మగౌరవ పోరాటం కాదని, అది ఆస్తులు పెంచుకునే ఆరాటమేనని విమర్శించారు. ‘‘రాజగోపాల్‌‌‌‌ రాజీనామా చేసిందే స్వార్థం కోసం. ఉప ఎన్నికలో రాజగోపాల్ గెలిస్తే ఆయన ఒక్కడికే లబ్ధి కలుగుతుంది. అదే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను గెలిపిస్తే ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుంది. నాగార్జునసాగర్‌‌‌‌, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ లెక్కనే మునుగోడు అభివృద్ధి కోసం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను గెలిపించాలి.  జూట మాటలు, జుమ్లా హామీల బీజేపీకి గుణపాఠం చెప్పాలి” అని పిలుపునిచ్చారు. 

రాష్ట్రానికి కేంద్రం అన్యాయం.. 

రాష్ట్రానికి మొదటి నుంచే కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలతో పాటు లోయర్‌‌‌‌ సీలేరు పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను గుంజుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోవడంతో నల్గొండతో పాటు దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. ‘‘కేంద్రం ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది. జీడీపీ, రూపాయి విలువ పడిపోయింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. బీజేపీ పాలనలో దేశంలో పేదరికం పెరిగింది. ఆకలి కేకలు పెరిగాయి. పాకిస్తాన్‌‌‌‌, శ్రీలంక, బంగ్లాదేశ్​లో  కంటే  మన దేశంలో పరిస్థితులు దిగజారాయి” అని అన్నారు. ఓటమి భయంతోనే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ .. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా వంద మందిని మునుగోడులో దించింనట్టుంది కదా! అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘మరి బీజేపీ నేతలు అమిత్‌‌‌‌షాను ఎందుకు తీసుకొచ్చారు. వాళ్లు ఓడిపోతామని భయపడటం లేదా?’’ అని మంత్రి హరీశ్ ఎదురు ప్రశ్న వేశారు. దుబ్బాక, హుజూరాబాద్‌‌‌‌ లో వచ్చిన రిజల్టే మునుగోడులో రిపీట్ అవుతుందా? అని ప్రశ్నించగా.. ‘‘బై ఎలక్షన్​కు సంబంధించి మేం చెప్పాల్సింది చెప్తాం. ఆపై తేల్చుకోవాల్సింది మునుగోడు నియోజకవర్గ ప్రజలే” అని అన్నారు. ఈ  సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌‌‌‌ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్‌‌‌‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి, మాజీ మేయర్‌‌‌‌ బొంతు రామ్మోహన్‌‌‌‌ పాల్గొన్నారు.

బీజేపీ అంటేనే మోసం.. 

రైతుల పోరాటంతో మోడీ క్షమాపణలు చెప్పి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని హరీశ్ అన్నారు. అప్పుడు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మోడీ హామీ ఇచ్చారని, కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదని చెప్పారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చి, గెలిచిన తర్వాత ‘‘గొంగడి మాది కాదు.. చెప్పులు మావికావు’’ అనే బాపతు పార్టీ బీజేపీ అని విమర్శించారు. ‘‘జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తామని చెప్పారు. నిజామాబాద్‌‌‌‌ లో అర్వింద్‌‌‌‌ పసుపు బోర్డు తెస్తానని, దుబ్బాకలో రఘునందన్‌‌‌‌ ఎడ్ల బండి ఇప్పిస్తానని చెప్పారు. కానీ ఇవేవీ అమలు చేయలేదు. బీజేపీ అంటేనే జుమ్లా..జూటా.. మోసం’’ అని విమర్శించారు. మునుగోడులో బీజేపీ నేతలు గోబెల్స్‌‌‌‌లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌‌‌‌కు రాజకీయంగా అవకాశాలు వచ్చినా నల్గొండలో ఫ్లోరైడ్‌‌‌‌ సమస్యను పరిష్కరించలేదని, ప్రజలకు ఏమీ చేయలేదని ఫైర్ అయ్యారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధ తీర్చే మిషన్‌‌‌‌ భగీరథకు రూపాయి ఇవ్వని బీజేపీకి మునుగోడులో ఓటు అడిగే హక్కు లేదన్నారు.