మలక్​పేట రైల్వే స్టేషన్ లో ..సెల్ ఫోన్ కోసం దారుణ హత్య

మలక్​పేట రైల్వే స్టేషన్ లో ..సెల్ ఫోన్ కోసం దారుణ హత్య
  • మొబైల్ ను అమ్మి రూ.1,700తో జల్సా చేసిన నిందితుడు
  • మలక్​పేట రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
  • ఇంకా లభించని హత్యకు గురైన వ్యక్తి వివరాలు 

సికింద్రాబాద్, వెలుగు : ఈ నెల 6న మలక్ పేట రైల్వే స్టేషన్ లో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి మర్డర్ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. జల్సాలకు బానిసైన పాత నేరస్తుడు ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో రైల్వే అడిషనల్​డీజీ మహేష్​ భగవత్, రైల్వే ఎస్పీ షేక్​ సలీమాతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో మలక్​పేట్​ రైల్వే స్టేషన్​లో మెట్లపై 35 ఏండ్ల  గుర్తుతెలియని వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్యచేసి పారిపోయినట్లు  నిర్ధారించుకొని, డెడ్​బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం మర్డర్​ జరిగిన సమయంలో రైల్వే స్టేషన్​లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి.. పలువురిపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో  గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో యాకత్​పురా రైల్వే స్టేషన్​ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని చాదర్​ఘాట్​ ఆజంపురా చమన్​ ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు మహ్మద్ సోహైల్​(24)గా గుర్తించారు.

ఆ సమయంలో అతని వద్ద ఓ కత్తి లభించడంతో వెంటనే కాచిగూడ పోలీసుస్టేషన్​కు తరలించి ఇంటరాగేట్​ చేశారు. అయితే, డబ్బుల కోసం గుర్తుతెలియని వ్యక్తి వద్ద ఉన్న సెల్ ఫోన్​​ను లాక్కొనేందుకు ప్రయత్నించానని, అతడు ప్రతిఘటించడంతో ఆవేశానికి గురై కత్తితో పొడిచి హత్య చేసినట్లు సోహైల్​చెప్పాడు. హత్య చేసిన తరువాత సెల్​ఫోన్​ను  ఎంజీబీఎస్​లో ఓ వ్యక్తికి  రూ.1,700 కు విక్రయించి ఆ డబ్బులతో జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకుని  అతన్ని రిమాండ్​కు తరలించారు.

సోహైల్​ షాఇనాయత్​ గంజ్, చాదర్​ఘాట్, మీర్​చౌక్, డబీర్​పురా, కాచిగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో  చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. కాగా, హత్యకు గురైన వ్యక్తి వివరాలు ఇంకా లభించలేదని, అతని వివరాల కోసం ఆధారాలు సేకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే, పోలీసుస్టేషన్ల పరిధిలో ఏమైనా మిస్సింగ్​కేసులు నమోదు అయి ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.