డేంజర్లో మూసారాం బాగ్ బ్రిడ్జ్..రాకపోకలు బంద్

డేంజర్లో మూసారాం బాగ్ బ్రిడ్జ్..రాకపోకలు బంద్

హైదరాబాద్ మూసారాం బాగ్ బ్రిడ్జ్ డేంజర్లో పడింది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో..మూసీ నదిలో వరద ఉదృతి పెరిగింది. దీంతో మూసారాం బాగ్ బ్రిడ్జ్ డేంజర్ లో పడింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి మూసారాం బాగ్ బ్రిడ్జ్ ను బంద్ చేశారు. బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేశారు. దీంతో  అంబర్ పేట - దిల్ సుఖ్ నగర్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. సెప్టెంబర్ 6వ తేదీ మరోసారి పరిస్థితిని సమీక్షించి రాకపోకలను అనుమతించనున్నారు.

సెప్టెంబర్ 5వ తేదీన హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ లకు భారీగా వరద పోటెత్తడంతో..అధికారులు నీటిని విడుదల చేశారు.  6గేట్ల ద్వారా హిమాయత్‌ సాగర్‌ నుంచి మూసీలోకి 4,120 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అటు ఉస్మాన్‌సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో 6గేట్ల ద్వారా 2028 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ప్రస్తుతం  హిమాయత్‌సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1763.50కి చేరింది.