- తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: ముషీరాబాద్ నియోజకవర్గంలో సర్ పేరిట అడ్డగోలుగా ఓట్లను తొలగించారని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సెగ్మెంట్ లో ఉన్న మొత్తం 3.10 లక్షల ఓట్లలో ఏకంగా 1.40 లక్షల ఓట్లను (45 శాతం) డిలీట్చేశారని, మరో 92 వేల మందికి (30 శాతం) ఓట్లను ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
ఈనెల 9న ముషీరాబాద్లో నిర్వహించిన సర్ బాధితుల పబ్లిక్ హియరింగ్లో సుమారు 40 మంది బాధితులు ప్రత్యక్షంగా పాల్గొని తమ గోడును వెళ్లబోసుకున్నారని మురళి తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. చనిపోయినట్లు లిస్ట్లో పేర్కొన్న వాళ్లు వచ్చి మేం బతికే ఉన్నామంటూ అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
పర్మనెంట్ షిఫ్ట్ పేరుతో తీసేసిన వాళ్లు, జాడ లేరని తొలగించిన వాళ్లు వచ్చి మేం ఇక్కడే నివాసం ఉంటున్నామని మొరపెట్టుకున్నారని వివరించారు. ఇంట్లో ఆరుగురు పిల్లలు ఉన్నారనే కారణంతో తల్లిదండ్రుల పేర్లు తొలగించడం, పేర్లలో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నందుకు కూడా నోటీసులు జారీ చేయడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2002 లింకులేంటి..ఈ లాజిక్లేంటి?
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించాల్సి ఉండగా.. ఇక్కడ మెజారిటీ ప్రజల ఓట్లను తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆకునూరి మురళి ఆరోపించారు. ఈ సర్వేలో 2002 ఓటర్ల లిస్టు, తల్లిదండ్రులు, తాతల పేర్లతో లింకులు పెట్టి, లాజికల్ డిస్క్రిపెన్సీ పేరుతో సామాన్యులను వేధించడం ఏంటని ప్రశ్నించారు.
ఓట్లు పోయిన వాళ్లు మళ్లీ ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కొందరు సలహాలు ఇస్తున్నారని, అయితే ఫామ్-6 కొత్త ఓటర్ల నమోదు కోసమేనని, అక్రమంగా ఓట్లు కోల్పోయిన పౌరుల కోసం కాదని ఆయన గుర్తుచేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్ముతూ వ్యవస్థలను సమర్థించడం సరికాదని మురళి హితవు పలికారు.
