ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్ తీసుకోవద్దు.. రెండు స్థానాల్లో గెలవాల్సిందే: సీఎం రేవంత్

ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్ తీసుకోవద్దు.. రెండు స్థానాల్లో గెలవాల్సిందే: సీఎం రేవంత్
  • ఈ ఎన్నికలను ఎవరూ లైట్‌‌‌‌గా తీసుకోవద్దు
  • పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి దిశా నిర్దేశం 
  • వచ్చే ఎలక్షన్స్‌‌‌‌పై దీని ఎఫెక్ట్‌‌‌‌ ఉంటుందని వ్యాఖ్య
  • నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవు
  • జిల్లా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్న సీఎం
     

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని, ఈ రెండు స్థానాలను గెలవాల్సిందేనని పార్టీ 
శ్రేణులకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ రాబోయే ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉంటుందని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలో పాల్గొనాలన్న అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు నేపథ్యంలో ఢిల్లీ వచ్చిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు, విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సమావేశమయ్యారు.  తుగ్లక్ రోడ్ 23 లోని సీఎం అధికారిక నివాసంలో దాదాపు గంటకు పైగా పార్టీ నేతలతో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడారు. ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. 

గెలుపే లక్ష్యంగా పని చేయండి

మహబూబ్‌‌నగర్–రంగారెడ్డి – హైదరాబాద్, నల్గొండ–వరంగల్–ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలను సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశించారు. ఈ రెండు స్థానాల్లో గెలుపు బాధ్యతలను జిల్లా మంత్రులకు అప్పగించారు. అయినప్పటికీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీలు అందరూ సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఫస్ట్ ప్రైజ్‌‌కే విలువ అని, సెకండ్ ప్రైజ్ ఉండదన్నారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 43 మందికి బాధ్యతలు అప్పగిస్తున్నామని, ఇప్పటి నుంచే వారంతా క్షేత్ర స్థాయిలో పని చేయాలని ఆదేశించారు.

పట్టభద్రుల ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌, ఇతర అంశాలపై రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. మొదటి ప్రాధాన్యత ఓటుపైనే దృష్టి పెట్టాలని, రెండో ప్రాధాన్యత ఓటు అనే విషయాన్ని పార్టీ నేతలు ఎవరు కూడా పరిగణనలోకి తీసుకోవద్దని సీఎం స్పష్టం చేశారు.  రెండు ఎమ్మెల్సీలను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించేలా ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగావకాశాలు, వారి విషయంలో ప్రభుత్వం చూపే చిత్తశుద్ధిని ఈ సందర్భంగా నేతలు జనంలోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ఈ నెల 19 లేదా 23న సంబంధిత నియోజక వర్గాల నేతలతో మరోసారి సమావేశం నిర్వహిస్తానని స్పష్టం చేశారు.