- దసరా సెలవులొచ్చినా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి
- బయటకెళ్లి ఆడుకోవాలని ఉందని విజ్ఞప్తి
హుస్నాబాద్, వెలుగు : ‘ఇంట్లో నుంచి బయటకెళ్తే కోతులు దాడి చేస్తున్నయ్.. స్కూల్ బ్యాగులు చూస్తే చాలు వెంటపడుతున్నయ్.. దసరా సెలవులొచ్చినా బయటికెళ్లి దోస్తులతో కలిసి ఆడుకోలేకపోతున్నం.. ఈ కోతుల బెడద నుంచి మమ్మల్ని కాపాడండి సారూ..’ అంటూ హుస్నాబాద్లోని చిన్నారులు మున్సిపల్ అధికారులను కలిసి వేడుకున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో కొన్నిరోజులుగా కోతుల హల్చల్ ఎక్కువైంది. వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే కోతులు గుంపులుగా వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. రోజురోజుకూ కోతుల బెడద తీవ్రరూపం దాల్చడంతో విసిగిపోయిన కాలనీ చిన్నారులు మంగళవారం నేరుగా మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు. తమ గోడును వెళ్లబోసుకుంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం దసరా సెలవులు ఉన్నప్పటికీ, కోతుల భయంతో ఇండ్లకే పరిమితం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లకు వెళ్లే సమయంలోనూ కోతుల తమ బ్యాగులు లాక్కునేందుకు ప్రయత్నిస్తూ గాయపరుస్తున్నాయని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
