
ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీం విధ్వంసం సృష్టించాడు. కేవలం 60 బంతుల్లోనే 100 పరుగులు బాదాడు. ఇందులో 14 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఆటగాడిగా ముష్ఫికర్ రహీం రికార్డు నమోదు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 6వ స్థానంలో బరిలోకి దిగిన ముష్ఫికర్ ఆకాశమే హద్దుగా చెలరేగి వన్డే కెరీర్‌లో 9వ సెంచరీ నమోదు చేయడంతో పాటు 7000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు.
ముష్ఫికర్ మెరుపు సెంచరీతో పాటు లిటన్ దాస్ (70), నజ్ముల్ హొస్సేన్ షాంటో(73) పరుగులు చేయడంతో బంగ్లా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. బంగ్లా జట్టుకు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇదే సిరీస్‌లో మార్చి 18న ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 338 పరుగులు చేసింది.