టీ20 క్రికెట్ నుంచి ముష్ఫీకర్ రహీం రిటైర్

టీ20 క్రికెట్ నుంచి ముష్ఫీకర్ రహీం రిటైర్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీం టీ20లకు గుడ్ బై చెప్పాడు. వన్డే, టెస్టులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు  ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆసియాకప్ లో రెండు మ్యాచుల్లో ఆడిన ముష్ఫికర్ రహీం..5 పరుగులే చేశాడు. 

ఆసియాకప్లో దారుణ ఓటమి..
ఆసియా కప్ 2022లో బంగ్లాదేశ్ దారుణంగా విఫలమైంది. అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్‌లల్లోనూ ఓడిపోయింది.  తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై, అనంతరం శ్రీలంకపై దారుణంగా ఓడింది. ఆఫ్ఘనిస్తాన్ పై ముష్ఫికుర్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రీలంకపై  నాలుగు పరుగులే చేసి కరుణరత్నె బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

ఓటమితో రిటైర్మెంట్ ఆలోచన..
ఆసియాకప్ 2022లో ఆడిన  రెండింట్లోనూ బంగ్లాదేశ్ విఫలం కావడంతో దీని ప్రభావం రహీంపై పడింది. ఈ నేపథ్యంలో టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. వన్డే, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. లీగ్ మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.  ముష్ఫికర్ ఇప్పటివరకు బంగ్లాదేశ్ తరఫున 102 టీ20 మ్యాచ్‌లను ఆడాడు. 1500 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 19.23.