
- ఐదు రోజులైనా ఏర్పాటు చేయని గేటు
- 3.2 టీఎంసీలు వృథా.. మిగిలింది 0.690 టీఎంసీలే
మూసీ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి ఐదు రోజులైనా కొత్తది ఏర్పాటు చేయకపోవడంతో లీకేజీ కొనసాగుతోంది. శనివారం గేటు కొట్టుకుపోయే సమయానికి 644.80 అడుగుల నిల్వ ఉండగా ప్రస్తుతం 620 అడుగులకు నీటి మట్టం పడిపోయింది. ఇప్పటికే మూసీ నుంచి 3.2 టీఎంసీల నీరు వృథాగా పోయింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 0.690 టీఎంసీల నిల్వ ఉంది. మూసీకి హైదరాబాద్ నుంచి ప్రస్తుతం 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 8000 క్యూసెక్కులు బయటకు వృథాగా పోతోంది. భవిష్యత్ అవసరాల కోసం 5 గేట్లను తయారు చేయగా చిత్తూరు జిల్లాలోని కల్యాణి డ్యామ్ కు 4 గేట్లను వినియోగించారు. మిగిలిన స్టాఫ్ లాగ్ గేటు ఆదివారం ఇక్కడకు తెచ్చారు. ప్రాజెక్ట్ కు ముఖ్యమైన గేటును హైదరాబాద్ మియాపూర్ లో తయారు చేయిస్తున్నారు. గురువారం కొత్త గేటు అమర్చే అవకాశం ఉంది.