
హైదరాబాద్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అంబర్ పేట్ దగ్గరున్న మూసారాంబాగ్ దగ్గర బ్రిడ్జికి అనుకుంటూ వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలో అంబర్ పేట్ నుంచి దిల్ షుక్ నగర్ వెళ్లే వాహనాలను దారి మళ్లించి గోల్నాక బ్రిడ్జి నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా.. రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మంగళవారం ( ఆగస్టు 12 ) నుంచి గురువారం ( ఆగస్టు 14 ) వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
ఇవాళ ( ఆగస్టు 12 ) రాబోయే రెండు గంటల పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లో గంటకు 41 నుంచి- 61 కి.మీ.ల మధ్య గరిష్ట ఉపరితల గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాల్లో గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో).. తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.