
- హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తడంతో పరీవాహక ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీళ్లు
- సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు
- మునిగిన మూసానగర్, శంకర్ నగర్, చాదర్ ఘాట్
- ఆరు పునరావాస కేంద్రాల ఏర్పాటు
- 400 మంది తరలింపు
- మూసారాంబాగ్ బ్రిడ్జి,
- జియాగూడ 100 ఫీట్ల రోడ్డు తాత్కాలికంగా క్లోజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీని వరద ముంచెత్తింది. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ కు ఇన్‌ఫ్లో పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదిలారు. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లోని పలు ఇండ్లలోకి వరద చేరింది. కొన్ని ప్రాంతాల్లో జనాలకు సమాచారం లేక అకస్మాత్తుగా ఇండ్లలోకి నీళ్లు రావడంతో ఇబ్బందులు పడ్డారు.
వరద నీటితో ఇండ్లలో నిత్యావసర వస్తులు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు. కొంతమంది బంధువులు, తెలిసిన వారి ఇండ్లకు వెళ్లగా, మరికొందరిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
11 గేట్లెత్తిన అధికారులు
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్‌కు భారీగా వరద చేరుతోంది. దీంతో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఒక గేటు, 8న నాలుగు గేట్లు ఓపెన్ చేసి వరదను మూసీలోకి వదిలారు. అప్పటినుంచే పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే, రెండు రోజులుగా నగరంతో పాటు ఎగువ ప్రాంతాలైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గురువారం హిమాయత్ సాగర్ 9 గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి మూసీలోకి నీటిని వదిలారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 11 గేట్లను ఎత్తారు. ఇన్ ఫ్లో తగ్గడంతో సాయంత్రం రెండు గేట్లను క్లోజ్చేశారు. గురువారం సాయంత్రానికి 9,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 12,042 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది. దీంతో మూసీలో వరద ఉధృతి పెరిగింది.
ముసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్
మూసీలో భారీ వరద కారణంగా ముసారాంబాగ్ బ్రిడ్జిని క్లోజ్ చేశారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. జియాగూడ నుంచి పురాణాపూల్ వెళ్లే 100 ఫీట్ల రోడ్డును కూడా బంద్‌చేశారు. మూసీలో ఉన్న దోభీఘాట్లలోకి బట్టలు ఉతకడానికి అనుమతి ఇవ్వలేదు. చాదర్ ఘాట్ బ్రిడ్జి పక్కన మూసానగర్, శంకర్ నగర్ లోని ఇండ్లు నీట మునిగాయి. దీంతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి వెళ్లి జనాలను ఖాళీ చేయించారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 127 ఇండ్లలోకి వరద చేరగా, అక్కడికి సమీపంలోని కమ్యూనిటీ హాల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి జనాలను అందులోకి తరలించారు.
మూసానగర్‌లో 110 మంది, శంకర్ నగర్ లో 290 మందిని షెల్టర్హోమ్స్కు తరలించినట్టు అధికారులు చెప్పారు. అలాగే, వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారు ఇండ్లు ఖాళీ చేయాలని రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు సూచనలు చేశారు. కాలనీలు, బస్తీల్లోకి వెళ్లి ఇండ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు రావాలని కోరారు.
తీవ్రత పెరిగితే రెడ్ అలర్ట్
మూసీకి మరింత వరద తీవ్రత పెరిగితే చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసారాం బాగ్, ఓల్డ్ మలక్ పేట్, కమలానగర్, జియాగూడ, ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించనున్నారు. చాదర్ ఘాట్ బ్రిడ్జికి ఆనుకొని నీరు వెళ్తున్నప్పటికీ రాకపోకలు కొనసాగించారు. ఉధృతి పెరిగితే ఈ బ్రిడ్జిని కూడా క్లోజ్ చేసే అవకాశాలున్నాయి.