తమ్ముడు పల్లా..సమస్య పరిష్కరించు.. చేతులు జోడించి వేడుకుంటున్న : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

తమ్ముడు పల్లా..సమస్య పరిష్కరించు.. చేతులు జోడించి వేడుకుంటున్న : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

జనగామ, వెలుగు: ఎమ్మెల్యే సీటు గుంజుకున్నరు.. ప్రజా క్షేత్రంలో లేకుండా చేసిన్రు.. ఇంకా నాపై ఎందుకీ వేధింపులు..దళిత బంధు కోసం ఎవరి వద్దా నయా పైసా వసూలు చేయలే.. తమ్ముడూ పల్లా రాజేశ్వర్​ రెడ్డీ... స్పందించి సమస్య పరిష్కరించు’ అని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతులు జోడించి వేడుకున్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

 పాతాళంలో ఉన్న పార్టీని 2009 నుంచి కష్టపడి తిరుగులేని శక్తిగా మార్చానన్నారు. తనను నేరుగా ఎదుర్కోలేకే తన కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి ఎమ్మెల్యే టికెట్​రాకుండా చేశారన్నారు. ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీ టికెట్​ రేసులో ఉన్న క్రమంలో దళితబంధులో డబ్బులు వసూలు చేశాడంటూ మళ్లీ రాజకీయ కుట్రలు చేస్తున్నారన్నారు. ఇన్నాళ్లు లేనిది ఎంపీ టికెట్లు ఇచ్చే టైంలో ఎందుకు వచ్చిందన్నారు. నియోజకవర్గంలో ఏ మండలంలో సమస్య లేదని, మద్దూరులో మాత్రమే ఉందని అది అక్కడి ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి చేసిన వసూళ్ల నిర్వాకం అని అన్నారు.

 దీనిపై పార్టీ నియోజకవర్గ పెద్దగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి బాధ్యత తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి హైదరాబాద్​లో ఉన్న విలువైన భూములను అమ్మి పార్టీ కోసం ఖర్చు చేసిన చరిత్ర తనదన్నారు. దళితుల దగ్గర డబ్బులు వసూలు చేయాల్సిన దుస్థితిలో తాను లేనన్నారు. తనపై జరుగుతున్న కుట్రలు అధిష్టానం గమనిస్తుందన్నారు. బీఆర్​ఎస్​ లీడర్లు బాల్దె సిద్దిలింగం, లెనిన్​, దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.