- ఎనిమిదో స్థానంలో తెలంగాణ
- మొత్తం ఆస్తుల్లో 2.5 శాతం వాటా54.44 లక్షల ఖాతాలు
- హైదరాబాద్‌లోనే అత్యధికం వెల్లడించిన ఆంఫీ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయని అసోసియేషన్‌ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) వెల్లడించింది. సంస్థ సీఈఓచలసాని వెంకట్ హైదరాబాద్‌లో శుక్రవారం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన వృద్ధిని సాధించాయి. ఈ పథకాల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్( ఏయూఎం) విలువ రూ.2.95 లక్షల కోట్లకు చేరింది.
తెలంగాణ దేశంలోనే ఎనిమిదో స్థానంలో నిలవగా, మొత్తం ఆస్తుల్లో సుమారు 2.5 శాతం వాటా సాధించింది. ఏయూఎం విలువ గత నెల నాటికి రూ.2.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 19 శాతం ఎక్కువ. ఇందులో హైదరాబాద్ వాటాయే 87 శాతం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య 54.44 లక్షలకు చేరుకోగా ఇది దేశంలోని మొత్తం ఖాతాల్లో 2.9 శాతానికి సమానం.
పెట్టుబడిదారుల భాగస్వామ్యం కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. సిస్టమాటిక్ఇన్వెస్ట్మెంట్ప్లాన్(సిప్) విధానం ద్వారా దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు కొనసాగించడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. సిప్ విధానంలో సగటు ఇన్వెస్ట్మెంట్ రూ.3,200 వరకు ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 23 శాతం వృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లోనూ మ్యూచువల్ ఫండ్ పథకాల ఏయూఎం విలువ రూ.82,409 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది జులైతో పోలిస్తే 23 శాతం వృద్ధిని కనిపించింది. ఏపీలోని మొత్తం ఆస్తుల్లో విశాఖపట్నం వాటా 20 శాతం కాగా, విజయవాడకు 10 శాతం వాటా ఉంది. ఏపీలోనూ మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య 79.44 లక్షలకు చేరింది. ఇది దేశంలోని మొత్తం ఖాతాల్లో 2.9 శాతం వాటాకు సమానం.
రెండు రాష్ట్రాల్లో పెట్టుబడిదారుల భాగస్వామ్యం అన్ని వర్గాలకు విస్తరిస్తోంది. తెలంగాణలోని పెట్టుబడిదారుల్లో 24.42 శాతం మంది మహిళలు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 23.60 శాతం మంది మహిళా ఇన్వెస్టర్లు ఉన్నారు. తెలంగాణ జీడీపీ రూ.17.82 లక్షల కోట్లుగా ఉండగా, ఇది దేశ జీడీపీలో 5 శాతం వాటాకు సమానం. ఏపీ జీడీపీ రూ.17.62 లక్షల కోట్లుగా ఉండగా, ఇది దేశ జీడీపీలో 4.9 శాతం వాటాకు సమానం.
‘‘మ్యూచువల్ ఫండ్స్‌పై మేం దేశమంతటా అవగాహన కల్పిస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు లెక్చరర్లకు వైజాగ్‌లో శిక్షణ ఇచ్చాం. వీళ్లు పది వేల మంది విద్యార్థులకు పెట్టుబడులు గురించి తెలియజేశారు. తెలంగాణ, ఏపీలో సిప్‌లకు ఆదరణ పెరుగుతుండటం సానుకూల పరిణామం. పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పాటించే ధోరణి పెరుగుతుందనడానికి ఇది నిదర్శనం ’’- ఆంఫీ సీఈఓ చలసాని వెంకట్
