హైదరాబాద్, వెలుగు: బండి సంజయ్ కుమారుడు భగీరథ్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాను సోమవారం చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని, అవి తన వ్యక్తిగతమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చేసిన ప్రకటనపై మంగళవారం ఒక ప్రకటనలో పొన్నం వివరణ ఇచ్చారు. బాధితురాలికి న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని, ఈ విషయంలో బండి సంజయ్ విచారణను ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని స్పష్టం చేశానన్నారు. తన వ్యాఖ్యల్లో కుల ప్రస్తావన వచ్చినా, పెళ్లి చేసుకోవాలనే పదం వాడినా.. దాని అసలు అర్థం మాత్రం బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని తెలిపారు. బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని, అందుకోసం పోరాడుతానని వివరించారు.
నీట్ రద్దుతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరం..
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్ష రద్దుతో రాష్ట్రంలోని 71 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వేలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని నీట్ పరీక్ష రాశారని పేర్కొన్నారు. పరీక్షను రద్దు చేసి వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందని మంగళవారం ఒక ప్రకటనలో పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పేపర్ లీక్ అయింది బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్తాన్‌లో అని, దీన్ని రద్దు చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో, దేశంలో ఇలాంటి వైఫల్యాలు ఎదురవడం విద్యార్థుల భవిష్యత్తుపై వారి నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం అంటూ కేంద్రంపై మండిపడ్డారు.
