మేం బీఆర్ఎస్సోళ్లపై ఫోకస్​ పెడితే..రోజుకొకరు జైలుకు పోతరు:మైనంపల్లి

మేం బీఆర్ఎస్సోళ్లపై ఫోకస్​ పెడితే..రోజుకొకరు జైలుకు పోతరు:మైనంపల్లి
  •     మల్లారెడ్డికి మళ్లీ పాలు, పూలు అమ్ముకునే పరిస్థితి వస్తది
  •     మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శ

మేడ్చల్, వెలుగు :  తాము బీఆర్ఎస్​లీడర్లపై ఫోకస్​పెడితే రోజుకొకరు జైలు బాట పడతారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. కాంగ్రెస్​ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా కండ్లకోయలో జరగనున్న సీఎం సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, కాంగ్రెస్​నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్, బండి రమేశ్, నక్క ప్రభాకర్ గౌడ్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో సీఎం జోక్యం లేదని చెప్పారు. కోర్టు, కలెక్టర్ల ఆదేశాలతోనే కూల్చివేతలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో నిమగ్నమై ఉందన్నారు.

 పాలమ్మినా.. పూలమ్మినా అని చెప్పుకునే ఎమ్మెల్యే మల్లారెడ్డిని కాంగ్రెస్​ప్రభుత్వం తిరిగి అదే స్థితికి తీసుకెళ్తుందన్నారు. భూ కబ్జాదారుడైన మల్లారెడ్డిని కాంగ్రెస్ లోకి రానివ్వమని చెప్పారు. బీఆర్ఎస్​పాలనలో మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి కుత్బుల్లాపూర్, దుండిగల్, బాచుపల్లి పరిధిలోని 1,200 ఎకరాలను కబ్జా పెట్టారని ఆరోపించారు. దుండిగల్, బౌరంపేట, కుత్బుల్లాపూర్ మండలాల్లోని ప్రభుత్వ, వక్ఫ్ బోర్డు భూములను స్వాహా చేశారని మండిపడ్డారు.  సీఎం రేవంత్​పై, కాంగ్రెస్​ప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాజీ మంత్రి కబ్జాల బాగోతం పూర్తిగా ఆధారాలతో తమ వద్ద ఉందని చెప్పారు. ఫేక్​డాక్యుమెంట్లతో యూనివర్సిటీ ఏర్పాటు, పేద విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలను మింగారని ఆరోపించారు. త్వరలో మరిన్ని కబ్జాలను బయటపెడతామన్నారు.