
డీటీడబ్ల్యూవో కోసమేనా.. ? మందు పార్టీ?
ఇంతకూ అక్కడ ఏం జరిగింది..?
అంతుబట్టని విషయాలెన్నో
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా పరిషత్ ఆఫీసు సమీపంలో ఉన్న ఎస్టీ బాయ్స్ హాస్టల్ లో స్వీపర్ గా పని చేస్తున్న స్వప్న సూసైడ్ మిస్టరీగా మారింది. ఆమె పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్పగా, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి, ఇంటి ఓనర్ చెప్తున్న విషయాలు భిన్నంగా ఉండటంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈనెల 11న హాస్టల్ ఇన్‌చార్జి నైతం లక్ష్మణ్, మరో హాస్టల్ ఆఫీసర్ మీనారెడ్డి, ఇంకో హాస్టల్ ఆఫీసర్ మల్లారెడ్డి హాస్టల్ లోని క్వార్టర్లో మందు పార్టీ చేసుకున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన డీటీడబ్ల్యూవో నారాయణ కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. సాయంత్రం 4గంటల ప్రాంతంలో స్వప్న, ఆమెతో సహజీవనం చేస్తున్న దుగునే జైలును వారు హాస్టల్ కు పిలిచారు. జైలుతో మందు, చపాతీలు తెప్పించుకున్నారు. జైలు కూడా వారితో కలిసి తాగి మధ్యలోనే బయటకు వచ్చాడు. ఆ తరువాత కొంత సేపటికి హాస్టల్ లో ఏదో గొడవ జరిగినట్లు తెలిసింది. స్వప్న, జైలు కలిసి రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లారు. అయిదు నిమిషాల్లోనే స్వప్న పాయిజన్ తీసుకుని సూసైడ్ అటెంప్ట్ చేసిందని జైలు ఇంటి ఓనర్ తో చెప్పాడు. వెంటనే బాధితురాలిని స్థానిక సర్కారు హాస్పిటల్ కు తరలించగా మృతి చెందింది.
పొంతనలేని విషయాలు…
మరునాడు పోలీసులు స్వప్న, జైలు మధ్య గొడవ వల్లే ఆమె తాను ఉంటున్న ఇంట్లో పాయిజన్ తాగిందని వెల్లడించారు. కానీ ఇంటి ఓనర్ మాత్రం ఆమె హాస్టల్ లోనే తాగి ఇంటికి వచ్చినట్టు చెప్పింది. అయితే ఇంట్లో తాగిందంటే తనకు ఇబ్బంది అవుతుందేమో అని ఓనర్ భయపడి తప్పుగా చెప్పిందని సీఐ పేర్కొన్నారు. పాయిజన్ బాటిల్ కూడా ఇంట్లోనే గుర్తించినట్టు సోమవారం ప్రెస్ మీట్ లో చెప్పారు. పరారీలో ఉన్న జైలును అరెస్ట్ చూపించారు. ఇంటి ఓనర్ కు, స్వప్నకు మధ్య వారం రోజులుగా డబ్బుల విషయంలో గొడవలు జరిగాయని సీఐ చెప్పగా, అటువంటిది ఏమిలేదని జైలు వెల్లడించడం గమనార్హం. నేను బయటకు వచ్చిన తరువాత నువ్వు అంత సేపు ఎందుకు హాస్టల్ లో ఉన్నావని స్వప్న ను మందలించినట్టు జైలు చెప్పాడు.
మందు పార్టీలు మామూలే….
ఎస్టీ బాయ్స్ హాస్టల్ లో తరచుగా మందు పార్టీలు జరగడం మాములేనని జైలు పేర్కొన్నాడు. మొన్న జరిగిన పార్టీలో లక్ష్మణ్, మీనారెడ్డి, మల్లారెడ్డి మాత్రమే ఉన్నారని సీఐ తెలిపారు. కానీ అక్కడ డీటీడబ్ల్యూవో నారాయణ కూడా ఉన్నాడని జైలు రిపోర్టర్ల ముందు చెప్పాడు. మరి ఏది నిజం? ఈ కేసులో నిజాలు బయటకు రావడం లేదని అనుమానాలు బలపడుతున్నాయి. సీఐ ముత్తి లింగయ్య మాత్రం సమగ్రంగా ఎంక్వయిరీ చేస్తున్నామని, డిపార్ట్‌మెంట్ హయ్యర్ ఆఫీసర్లకు కూడా రిపోర్ట్ చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో కేసు ఏ మలుపు తిరుగుతుందో.. !