‘పెద్ది’ టిక్కెట్ రేట్ల పెంపుపై పిటిషన్ వాపస్

‘పెద్ది’ టిక్కెట్ రేట్ల పెంపుపై పిటిషన్ వాపస్

హైదరాబాద్, వెలుగు:  జూన్ 4న విడుదలయ్యే 'పెద్ది' సినిమా టిక్కెట్ రేట్లను ఏడు రోజులపాటు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలని  కోరుతూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను మైత్రీ మూవీ మేకర్స్ ఉపసంహరించుకుంది. టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి కోరుతూ ఈ నెల 15న, అనంతరం 25న ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మైత్రీ మూవీ మేకర్స్ తరపున యలమంచిలి రవిశంకర్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌‌‌‌పై జస్టిస్ సుద్దాల చలపతిరావు శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రతాప్‌‌‌‌కుమార్ వాదనలు వినిపిస్తూ, టిక్కెట్ ధరల పెంపు విషయంలో అధికారులు నిర్ణయం తీసుకోవడం లేదన్నారు.  దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ వినతిపత్రంపై నిర్ణయం తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. చట్టం ప్రకారం అనుమతి ఇవ్వాలా, తిరస్కరించాలా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేశ్ రాజె వాదనలు వినిపిస్తూ ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కోర్టు ధిక్కరణ వ్యవహారం పెండింగ్‌‌‌‌లో ఉందని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. అధికారులను ఆశ్రయించేందుకు స్వేచ్ఛ కల్పిస్తూ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి 
ఉత్తర్వులు జారీ చేశారు.