ఆర్మీ స్పెషల్ పవర్స్ చట్టాన్ని రద్దు చేయాలె

ఆర్మీ స్పెషల్ పవర్స్ చట్టాన్ని రద్దు చేయాలె

నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో ఆర్మీ జవాన్ల కాల్పుల్లో మరణించిన పౌరుల అంత్యక్రియల్లో ఆ రాష్ట్ర సీఎం నిఫియు రియో నివాళి అర్పించారు. అంతకు ముందు వారి డెడ్‌బాడీలపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఆయన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 11 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రూ.5 లక్షల చొప్పున సాయంగా ఇస్తామని చెప్పారు.

నాగాలాండ్‌, మయన్మార్ సరిహద్దుల్లోని మోన్‌ ప్రాంతంలో మిలిటెంట్లు దాడి చేస్తారన్న సమాచారంతో ఆర్మీ జవాన్లు చేపట్టిన ఆపరేషన్‌లో పొరబాటున సామాన్యులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రజలు మరణించడంతో స్థానికులు జవాన్లపై తిరగబడ్డారు. దీంతో అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తంగా 14 మంది పౌరులు, ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఇది తమ పొరబాటు వల్ల జరిగిన ఘటన అని, ఆర్మీ ఇప్పటికే క్షమాపణ చెప్పింది. ఈ ఘటనపై కాల్పుల ఘటనపై విచారణకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసే ఓ మేజర్ జనరల్ ఇందుకు సారథ్యం వహిస్తారని స్పష్టం చేసింది.

స్పెషల్ పవర్స్ చట్టాన్ని రద్దు చేయాలె

ఈ ఘటనతో ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్ పవర్స్ యాక్ట్‌ (AFSPA)ను రద్దు చేయాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ చట్టం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని, నాగాలాండ్‌లో దీనిని తొలగించాలని ఆ రాష్ట్ర సీఎం నిఫియు రియో డిమాండ్ చేశారు. అలాగే ఇతర ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ చట్టం రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మేఘాలయ సీఎం సంగ్మా కూడాAFSPAను రద్దు చేయాలంటూ ట్వీట్ చేశారు.