కాంగ్రెస్​ పార్టీ.. కోవర్టుల చేతుల్లో : నాగం జనార్ధన్​రెడ్డి

కాంగ్రెస్​ పార్టీ.. కోవర్టుల చేతుల్లో : నాగం జనార్ధన్​రెడ్డి
  • ప్యారాచూట్​ లీడర్లకు టికెట్లిచ్చి నమ్ముకున్నోళ్లను ముంచిండ్రు
  • నాగం జనార్దన్ రెడ్డి ఫైర్ 
  • రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి

నాగర్​కర్నూల్/నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ కోవర్డుల చేతిలో ఉందని, బీఆర్ఎస్​నుంచి వచ్చిన ప్యారాచూట్​లీడర్లకు టికెట్లు ఇచ్చి తమకు నమ్మక ద్రోహం చేశారని  కాంగ్రెస్​ సీనియర్​నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్​రెడ్డి మండిపడ్డారు. సీనియర్ల పట్ల పీసీసీ అవమానకరంగా వ్యవహరిస్తోందని, బీఆర్ఎస్ లో పైసాకు చెల్లని లీడర్లు కాంగ్రెస్ కు దిక్కయ్యారా? అని ప్రశ్నించారు. సోమవారం ఆయన నాగర్ కర్నూల్ లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. నాగర్​కర్నూల్ టికెట్​ తనకు కాకుండా మరో లీడర్​కు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చిన వాళ్లకే టికెట్లు కేటాయించారని, మొదటి నుంచి కష్టపడ్డ వారికి టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన లీడర్లను పీసీసీ అవమానించిందని ఆవేదన వ్యక్తంచేశారు.

హైకమాండ్​ఆదేశాలతో అనేక సభలను తాను విజయవంతం చేసి, జనాల్లో ఉంటే.. జిల్లా ఎల్లలు, నియోజకవర్గ సమస్యలు తెలియని వారికి టికెట్ ఎలా  కేటాయించారని ఆగ్రహించారు.   తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో హైకమాండ్​స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువయ్యారా అని నిలదీశారు. పీసీసీ ప్రెసిడెండ్​రేవంత్​రెడ్డి ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను పూర్తిగా తుంగలో తొక్కారని నాగం మండిపడ్డారు.

మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ కేటాయించొద్దని, ఐదేండ్లు పార్టీ కోసం పని చేసిన వారికే టికెట్ ఇవ్వాలని ఉదయ్​పూర్​డిక్లరేషన్​లో ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తు అంశంపై ఎన్నికల నామినేషన్ గడువు ముగిసేలోపు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. 

ఇండిపెండెంట్​గా పోటీ : సీఆర్​ జగదీశ్వర్​రావు

పార్టీ కోసం ఏడేండ్లు కష్టపడిన తనను కాదని, పార్టీని ముంచిన జూపల్లి కృష్ణారావుకు కొల్లాపూర్​టికెట్​ఎలా ఇస్తారని కాంగ్రెస్​ఇన్​చార్జి సీఆర్​జగదీశ్వర్​ రావు ఫైర్​అయ్యారు. అదే నియోజకవర్గం నుంచి తాను ఇండిపెండెంట్​గా పోటీ చేసి, సత్తా ఏంటో చూపిస్తానన్నారు. కాంగ్రెస్​టికెట్​తనకు రాకపోవడంతో సోమవారం పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో అనుచరులు ఆయనకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఆర్​జగదీశ్వర్​రావు, నాగం జనార్దన్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్​ రావు మాట్లాడారు. ‘కాంగ్రెస్​ పిలుపు మేరకు ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు చేసినం.

రాహుల్​ భారత్​ జోడో యాత్రను సక్సెస్​ చేసినం. నాగర్​కర్నూల్, కొల్లాపూర్​లో భారీ బహిరంగ సభలు పెట్టి పార్టీకి ఊపు తెచ్చినం’ అని గుర్తు చేశారు. 2018లో కాంగ్రెస్​పార్టీని ఓడించేందుకు ప్రయత్నించిన జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించి, టికెట్​ఇవ్వడం కాంగ్రెస్​ కార్యకర్తలకు, కొల్లాపూర్​ ప్రజలకు పీసీసీ చేసిన ద్రోహమని మండిపడ్డారు. కాంగ్రెస్​ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు రేవంత్​ రెడ్డి, పీసీసీ పెద్దలు క్షమాపణలు చెప్పాలని నాగం జనార్ధన్ డిమాండ్​ చేశారు. సీనియర్లను గౌరవించే తీరు ఇదేనా ? అని ప్రశ్నించారు.