కాన్పు టైమ్‌లో ఊడొచ్చిన బిడ్డ తల.. లోపలే మొండెం: తల్లి పరిస్థితి విషమం

కాన్పు టైమ్‌లో ఊడొచ్చిన బిడ్డ తల.. లోపలే మొండెం: తల్లి పరిస్థితి విషమం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. మహిళకు కాన్పు సమయంలో బిడ్డ తల, మొండెం వేరయ్యాయి. తల ఊడి డాక్టర్ల చేతిలోకి రాగా.. మొండెం తల్లి కడుపులోనే ఉండిపోయింది. దీంతో తల్లి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పారు డాక్టర్లు. ఇలా జరిగానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆ మహిళ బంధువులు నిరసనకు దిగారు.

అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళకు బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను అచ్చంపేట ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు డెలివరీ చేసే ప్రయత్నంలో శిశువు తల పట్టుకుని లాగారు. దీంతో మొండెం లోపలే ఉండిపోయి.. తల మాత్రమే చేతికి వచ్చింది. దీంతో తల్లి స్వాతి పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేసే వీలు లేకపోవడంతో ఆమె ప్రాణం కాపాడుకోవాలంటే వెంటనే హైదరాబాద్‌లోని జడ్జికానా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు. ఆపరేషన్ చేసి బిడ్డ మొండెం బయటకు తీసినా.. స్వాతి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పరిస్థితి రావడానికి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు.

బిడ్డ మూడ్రోజుల ముందే చనిపోయిందంటున్న డాక్టర్లు

అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు మాత్రం తమ తప్పేమీ లేదని చెబుతున్నారు. తల్లి గర్భంలో ఉండగానే.. డెలివరీకి మూడ్రోజుల ముందే బిడ్డ మరణించిందని అన్నారు. బిడ్డ కడుపులో నీరు చేరి.. ప్రాణం కోల్పోయిందన్నారు. కాన్పు చేసే సమయంలో తల బయటకు వచ్చాక లాగినప్పుడు ఊడి వచ్చిందని, అయితే ముందే చనిపోయి ఉండడం వల్ల శిశువు శరీరమంతా ఊసిపోయి ఉందని తెలిపారు. మొండెం కూడా తాము తీసే ప్రయత్నం చేశామని, ఆపరేషన్ చేయాల్సి రావడంతో హైదరాబాద్ పంపామని చెప్పారు. అయితే బాధితురాలి కుటుంబసభ్యులు మాత్రం డాకర్ల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని అంటున్నారు. ఆస్పత్రికి వచ్చినప్పుడు బీపీ, పల్స్ అన్నీ నార్మల్‌గా ఉన్నాయని చెప్పి డెలివరీ రూమ్‌లోకి తీసుకెళ్లారని చెబుతున్నారు.