
- సాగర్ 14 గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి నీటి ప్రవాహం కాస్త తగ్గింది. ఇన్‌ఫ్లో 1,44,694 క్యూసెక్కులు వస్తుండడంతో 14 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,08,850 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు)కాగా శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు586. 90 అడుగుల(304.9865 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. సాగర్ రిజర్వాయర్ నుంచి ఏఎమ్మార్పీకి 2,400 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 29,394 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,44,694 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీకి 25,676 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
బాల్కొండ, వెలుగు : వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి 25,676 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రం వరకు 1080.70 అడుగుల(46.95 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ ఏఈ కొత్త రవి తెలిపారు. ఇక్కడి నుంచి కాకతీయ కెనాల్‌కు ఐదు వేల క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్‌కు 500, అలీసాగర్‌కు 180, తాగునీటి కోసం 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ దిగువన ఉన్న విద్యుత్ కేంద్రంలో 9 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్‌కో డీఈ శ్రీనివాస్
తెలిపారు.
గడ్డెన్న వాగు రెండు గేట్లు ఓపెన్
భైంసా, వెలుగు : నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. శుక్రవారం ఉదయం 1,250 క్యూసెక్కుల నీరు రాగా మధ్యాహ్నం వరకు 15,416 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక పూజలు చేసి నీటి విడుదలను ప్రారంభించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు కాగా ప్రస్తుతం 358.50 మీటర్ల నీరు నిల్వ ఉంది. రెండు గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.