జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దాం : కలెక్టర్ బాదావత్ సంతోష్

జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దాం : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు గురువారం ఆయనను కలిసి న్యూ ఇయర్​శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో  విలసిల్లాలని, అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, పంటలు సమృద్ధిగా పండి రైతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయని, సాంకేతికతను అందిపుచ్చుకొని మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని చెప్పారు. అనంతరం టీజీవో, తహసీల్దార్ల సంఘం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. అడిషనల్​కలెక్టర్ అమరేందర్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తదితరులున్నారు.

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించండి- 

జిల్లాలో ఈ నెల 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కరపత్రాలు, ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఫిట్​నెస్ లేని వాహనాలపై, లైసెన్స్​లేకుండా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జిల్లా రవాణా శాఖ అధికారి చిన్న బాలు తదితరులు పాల్గొన్నారు.