తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ భద్రత బలోపేతం.. మీడియా తో టెలికాం అదనపు డీజీ

తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ భద్రత బలోపేతం..  మీడియా తో టెలికాం అదనపు డీజీ

పద్మారావునగర్, వెలుగు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్ వినియోగదారుల డిజిటల్ భద్రత బలోపేతం చేస్తూ పౌరుల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని టెలికాం అదనపు డీజీ నాగేశ్ రావు తెలిపారు. బుధవారం సీటీవోలోని కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలంగాణలో ఇప్పటివరకు పోగొట్టుకున్న, దొంగిలించబడిన 1,02,148 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామన్నారు. ఇందులో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందున్నారని తెలిపారు. 

ఇదే పోర్టల్​లో నో యువర్ మొబైల్ కనెక్షన్ సేవ ద్వారా పౌరులు తమ పేరుతో జారీ అయిన ఫోన్ నంబర్లను పరిశీలించి అనధికార సిమ్ లను తొలగించినట్లు వివరించారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణలో 25.18 లక్షల మొబైల్ నంబర్లు రిపోర్ట్ కాగా, 23.65 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు వెల్లడించారు. వ్యక్తిగత వివరాలను దొంగిలించే కాల్స్, ఆర్థిక మోపాలను నివారించడంలో భాగంగా 2 ప్రధాన సీమ్ బాక్స్ సైబర్ మోసాలను గుర్తించి ధ్వంసం చేశామన్నారు.మొబైల్ ఫోన్ వినియోగదారులు సంచార్ సాథీ యాప్​ డౌన్​లోడ్​చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఈశ్వర్, హేమంత్రత్వే, సత్యనారాయణ, భాస్కర్ రావు, డైరెక్టర్ రాఘవరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సంపత్ కుమార్​ పాల్గొన్నారు.