- ఏడుగురు సిబ్బందికి ప్రభుత్వం తరఫున వేతనాలు
- నాగోబా దర్బార్‌లో మంత్రి కొండా సురేఖ హామీ
ఆదిలాబాద్/ఇంద్రవెల్లి, వెలుగు : ఆదివాసీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతరలో భాగంగా గురువారం నిర్వహించిన ‘నాగోబా దర్బార్’ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.
ముందుగా నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దర్బార్‌లో మాట్లాడుతూ... జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. నాగోబా ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 22 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులను సౌకర్యాల కల్పనతో పాటు అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు.
నాగోబా ఆలయంలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందికి ధూపదీప నైవేధ్య పథకం కింద ప్రభుత్వం తరఫున వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆలయంలో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అటవీ, పోడు భూముల సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనుల విద్యాభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ రాజర్షిషాతో కలిసి గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేశారు.
దర్బార్‌లో భాగంగా ఆదివాసీలు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, పాయల్ శంకర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, కేస్లాపూర్ సర్పంచ్ మేస్రం తుకారాం పాల్గొన్నారు.
