నేటి (నవంబర్ 19) నుంచి నాగుల్ మీరా చిల్లా ఉర్సు

నేటి (నవంబర్ 19) నుంచి నాగుల్ మీరా చిల్లా ఉర్సు
  • మత సామరస్యానికి కేరాఫ్ ​అడ్రస్ ​నాగుల్ ​మీరా చిల్లా
  • సత్యనారాయణపురంలో ముస్తాబైన చిల్లా 
  • రెండు రోజులు కొనసాగనున్న ఉత్సవాలు.. 
  • లక్ష మందికి పైగా హాజరు కానున్న భక్తులు 

భద్రాద్రికొత్తగూడెం/ఇల్లెందు, వెలుగు :   భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సత్యనారాయణపురం సమీప అటవీ ప్రాంతంలో కొలువైన హజరత్​ నాగుల్​ మీరా చిల్లా మత సామరస్యానికి కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది. నేటి నుంచి ఇక్కడ ఉర్సు షురూ కానుంది. బుధ, గురు వారాల్లో ఉత్సవాలు జరుగనున్నాయి. నిర్వహణ కమిటీ ఉర్సుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

అన్ని ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తులు.. 

సత్యనారాయణ పురంలోని హజరత్​ నాగుల్​ మీరా చిల్లా ఉర్సు ఉత్సవాల వేడుకలకు ముస్తాబైంది. ఇల్లెందు పట్టణంలోని నెంబర్​ 2 బస్తీలో గల హజరత్​ ఖాసీం దుల్హా నాగుల్​ మీరా దర్గాలో దశాబ్దాల కాలంగా ఉర్సు కొనసాగుతోంది. కుల, మతాలకతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్​ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 

సత్యనారాయణపురం గ్రామం నుంచి చిల్లాకు వెళ్లే దారి పొడవునా ఆధ్యాత్మిక సందేశాలు కనిపిస్తాయి. ఇక్కడ రోజూ ప్రార్థనలు కొనసాగుతాయి. ప్రతీ శుక్రవారం భక్తులు ఎక్కువగా వస్తుంటారు. కాగా, కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యకు జరిగే ఉర్సు బుధ, గురు, శుక్ర వారాల్లో కొనసాగనుండగా, దాదాపు లక్ష  మందికి పైగా భక్తులు తరలి వస్తారని నిర్వహణ కమిటీ అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. 

వెల్లివిరుస్తున్న మత సామరస్యం.. 

హజరత్​ నాగుల్​ మీరా చిల్లాలో ఉర్సుతో పాటు మొహర్రం వేడుకలు, శ్రీరామ నవమి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఉర్సులో భాగంగా ఇల్లెందు పట్టణంలోని నెంబర్​ 2బస్తీలోని హజరత్​ ఖాసీం దుల్హా దర్గా నుంచి సత్యనారాయణపురం సమీపంలోని నాగుల్​ మీరా చిల్లా వరకు ఛాదర్​, గంధం, ఖందిల్, పాల మట్కీలను ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ ఊరేగింపులో అయ్యప్ప స్వాములు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.