జూన్ 12 నుంచి స్కూల్స్​ రీ- ఓపెన్ .. బడి బస్సులు భద్రమేనా .. ఫిట్ నెస్ పై అధికారుల ఫోకస్

జూన్ 12 నుంచి స్కూల్స్​ రీ- ఓపెన్ .. బడి బస్సులు భద్రమేనా .. ఫిట్ నెస్ పై అధికారుల ఫోకస్
  • నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 1,222 స్కూల్​బస్సులు
  • ఫిట్​నెస్ ​పూర్తయినవి 270

నల్గొండ, వెలుగు :   ఫిట్ నెస్ లేకపోవడం, అనుభవం లేని డ్రైవర్ల కారణంగా ప్రైవేట్ స్కూళ్ల బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. బడి బస్సుల ఫిట్ నెస్ పై అధికారులు ముందస్తు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ప్రైవేటు విద్యాసంస్థలకు ముందస్తు సమాచారం ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీస్ ఎదుట నాలుగైదు రోజులుగా ప్రైవేటు బస్సులు క్యూకడుతున్నాయి. జూన్​ 12 నుంచి స్కూల్స్​ రీ– ఓపెన్ కానుండగా.. అదే రోజు నుంచి ఫిట్​నెస్ లేని, కాలం చెల్లిన బస్సులపై స్పెషల్ రైడ్స్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఫైర్‌ ఎస్టింగిషర్లు, గ్రిల్స్‌ తప్పనిసరి..

విద్యార్థుల భద్రత కోసం బస్సుకు మూడు వైపులా తప్పనిసరిగా ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ముఖ్యంగా బస్సు కదిలేటప్పుడు పిల్లలు కిటికీల నుంచి చేతులు బయటకు పెట్టకుండా గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలి. గ్రిల్స్‌ లేకపోతే ప్రయాణ సమయంలో విద్యార్థులు చేతులు బయటకుపెడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అనుకోని పరిస్థితుల్లో బస్సులో మంటలు చెలరేగితే వాటిని ఆర్పేందుకు ఫైర్‌ ఎస్టింగిషర్లు అందుబాటులో ఉండాలి. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకొని బస్సుల్లో ఫైర్‌ ఎస్టింగిషర్లు ఏర్పాటు చేయాలి. అయితే బస్సులో ఫైర్‌ ఎస్టింగిషర్స్‌ కనిపిస్తున్నప్పటికీ, అవి నామమాత్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కానరాని పరికరాలు..

విద్యాసంస్థల బస్సుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అందులో ప్రథమ చికిత్సకు సంబంధించి ఎలాంటి పరికరాలు ఉండటం లేదని తెలుస్తోంది. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సుల్లో తప్పనిసరిగా కాటన్‌, అయోడిన్‌, స్పిరిట్‌ బాటిల్‌, బ్యాండేజ్‌ ఉండాలనే నిబంధన ఉంది. బస్సుల్లో తదితర వస్తువులు ఉన్నప్పటికీ అవి కాలం చెల్లినవి ఉండటం గమనార్హం. చిన్నచిన్న ప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు ఉపయోగపడతాయి. వీటితోపాటు విద్యార్థులు.. బ్యాగులు పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. 

ఊసేలేని డ్రైవర్ల మెడికల్‌ సర్టిఫికెట్లు..

పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లకు రెండేండ్లకు ఒకసారి వైద్య చికిత్సలు చేయించి మెడికల్‌ సర్టిఫికెట్‌ అందుబాటులో ఉంచాలి. కానీ ఈ విషయమై యాజమాన్యాలు దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. డ్రైవర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు యాజమాన్యాలు ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండి ఐదేండ్లు అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. లైట్లు, హ్యాండ్‌ బ్రేక్‌, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పసుపుపచ్చ రంగు కలిగి ఉండాలి. డ్రైవర్​కు సంబంధించిన పూర్తి వివరాలను విధిగా బస్సులో ప్రదర్శించాలి. 

ఏమి లేకున్నా ఫిట్ నెస్ సర్టిఫికెట్..

బడి బస్సుల ఫిట్​నెస్​ టెస్టులు నిర్వహిస్తున్న ఆర్టీఏ అధికారులు నామమాత్రపు చర్యలతో మమ అనిపిస్తున్నారు. వాస్తవానికి ఫిట్​నెస్​ పరీక్షలు నిర్వహించే అధికారులు బస్సు టైర్ల కండిషన్ నుంచి పిల్లలు ఎక్కే మెట్లు, సీట్లు, కిటికీలకు గ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోస్​ ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేయాలి. కొన్ని బడా, కార్పొరేట్ స్కూల్ బస్సుల కిటికీలకు గ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ కిట్లు ఏమి లేకున్నా ఆఫీసర్లు ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

20 శాతానికి పైగా చివరి దశలో.. 

సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 1,222  స్కూల్ బస్సులు ఉన్నాయి. అందులో నల్గొండ జిల్లాలో 1,042 బస్సులు, సూర్యాపేట జిల్లాలో 18-0 బస్సులు ఉన్నాయి. ఇందులో దాదాపు 20 శాతం వరకు ఫిట్ నెస్ బస్సులు ఉంటున్నాయి. నల్గొండ జిల్లాలో 1042 బస్సులు ఉండగా, వీటిలో దాదాపు 300 బస్సులు కాలం చెల్లినవి ఉండడం గమనార్హం. ఇప్పటివరకు 240 బస్సులకు మాత్రమే ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో 180 బస్సులు ఉండగా,  ఇప్పటివరకు కేవలం 30 బస్సులు మాత్రమే ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు. మరోవారం రోజుల్లో మరిన్ని బస్సులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.