
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల బృందం తొలిసారిగా మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. నల్గొండ మండలం చర్లపల్లికి చెందిన వజ్జ ఎర్రయ్య(65) తీవ్ర మోకాలి నొప్పితో నడవలేని పరిస్థితిలో ఉండి బాధపడుతూ చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లను సంప్రదించాడు. ఆర్థోపెడిక్ డాక్టర్లు టెస్టులు చేసి ఎర్రయ్యకు మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ చేయాలని సూచించారు.
ఈనెల 2న ఆస్పత్రి ఆర్థోపెడిక్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ నాగరాజు, ఇన్ చార్జ్ హెచ్ వోడీ డాక్టర్ కృష్ణ నాయక్, డాక్టర్ సైదులు, డాక్టర్ మల్లికార్జున్, రాహుల్ బృందం సర్జరీ చేసి సక్సెస్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో అత్యుత్తమ నైపుణ్యాలతో సర్జరీలో ఇంప్లాంట్లను వాడినట్టు డాక్టర్ల బృందం తెలిపింది.
ఇప్పుడు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, మోకాలి నొప్పి తగ్గిపోయిందని పేషెంట్ ఎర్రయ్య తెలిపారు. ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడంతో తనలాంటి వారికి ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో తొలిసారి మోకాలి సర్జరీని సక్సెస్ చేసినందుకు డాక్టర్ల టీమ్ ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి అభినందించారు.