సర్కారు దవాఖానాలో రోగి మృతి

సర్కారు దవాఖానాలో రోగి మృతి
  • నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని డాక్టర్లను నిలదీసిన కుటుంబ సభ్యులు
  • సర్ది చెప్పిన పోలీసులు  
  • ఎస్పీకి ఐఎంఏ ఆధ్వర్యంలో ఫిర్యాదు

నల్గొండ అర్బన్‌, వెలుగు : అనారోగ్యంతో ఉన్న తమ బంధువును ప్రభుత్వ దవాఖానాకు తీసుకువస్తే డాక్టర్లు పట్టించుకోలేదని, దీంతో చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం...నల్లగొండ జామామసీదుకు చెందిన కంది బుచ్చిరాములు(50) కిడ్నీ, లివర్ ​వ్యాధులతో బాధపడుతూ బుధవారం ప్రభుత్వ దవాఖానాలో అడ్మిట్​అయ్యాడు. సిబ్బంది ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్​మెంట్​అందిస్తుండగా చనిపోయాడు. అయితే డాక్టర్లు సకాలంలో వైద్యం అందించకపోవడంతోనే బుచ్చిరాములు చనిపోయాడని అతడి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ నిరసనకు దిగారు. డాక్టర్లు, సిబ్బందిపై చర్య తీసుకోవాలని హాస్పిటల్​ఎదుట ధర్నా చేశారు. అక్కడికి వచ్చిన డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు.

విషయం తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, సీఐ చంద్రశేఖర్​రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్​రెడ్డి అక్కడికి వచ్చి ఇరువర్గాలను సముదాయించారు. ఈ సందర్భంగా ప్రశ్నించిన తమపైనే డాక్టర్లు దాడి చేయడానికి ప్రయత్నించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా డాక్టర్లే రివర్స్​లో తాము దాడి చేశామని పోలీసులకు ఫిర్యాదు చేశారని మృతుల కుమారులు వాపోయారు. దీంతో వీరిని పోలీస్​స్టేషన్​కు తీసుకువెళ్లి కొద్దిసేపటి తర్వాత వదిలేశారు. మరోవైపు ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు తమపై దాడి చేసిన రోగి బంధువులను శిక్షించాలని ఎస్పీ రెమా రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జిల్లా దవాఖాన సూపరింటెండెంట్​లచ్చూనాయక్​ను ఫోన్​లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.